బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు గత కొద్ది రోజులుగా మీడియాలో మారు మోగిపోతోంది. ఒకటి వెంకటేశ్ సినిమాలో నటిస్తుండటం అయితే, రెండోది ఆయన వ్యక్తగిత విషయం. అవును ఫ్యామిలీ లైఫ్ విషయంలో జరుగుతున్న కొన్ని విమర్శలు, ప్రతి విమర్శలతో ఆయన పేరు మీడియాలో, సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. నవాజుద్దీన్ భార్య అలియాపై ఆమె అత్త (నవాజుద్దీన్ తల్లి) ఇటీవల కేసు పెట్టగా.. ఇప్పుడు ఏకంగా తనను ఇంట్లో హింసిస్తున్నారు అంటూ ఆలియా విమర్శలు చేశారు.
వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంతో కీర్తి గడించారు. అయితే ఇప్పుడు వ్యక్తిగత జీవితం విషయంలో రచ్చకెక్కాడు. భార్య అలియాకి, నవాజుద్దీన్ తల్లి మొహ్రూనిసాకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అవి ఆస్తి విషయంలో అని సమాచారం. ఆలియా మీద మొహ్రూనిసా కేసు పెట్టగా, ఇప్పుడు ఆలియా మాట్లాడుతూ తనకు కనీసం అన్నం కూడా పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేస్తున్నారు అని పేర్కొన్నారు. వంటగదిలోకి తనను రానివ్వడం లేదని, ఆఖరికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేసేవాళ్లను కూడా రాకుండా చేస్తున్నారని ఆలియా ఆరోపించారు.
తనను బెడ్ రూమ్లో కూడా నిద్రపోనివ్వడం లేదని చెప్పిన ఆలియా, హాల్లో సోఫాలోనే నిద్రపోవాల్సి వస్తోందని ఆలియా ఆరోపించారు. పోలీసులను కలవకుండా చేస్తున్నారని ఆమె చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన లాయర్ ద్వారా విషయం బయటకు చెప్పాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. నవాజుద్దీన్ భార్యగా తనకు ఇంట్లో ఉండే హక్కు లేదా అంటూ ఆలియా వాపోయారు. అయితే అలియా ఇంట్లో ఉండేందుకు వీలులేదని నవాజుద్దీన్ తల్లి గొడవ చేస్తున్నట్లు సమాచారం.
నవాజుద్దీన్, అలియా 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2020లో నవాజుద్దీన్ – ఆలియా విడిపోయారు. ఈ క్రమంలో విడాకులు తీసుకున్నా.. ఆ తర్వాత మనుసు మార్చుకుని తిరిగి భర్తతో కలసి ఉంటున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు అలియా, మొహ్రూనిసా గొడవపడుతున్నారు. ఇందులో తప్పొప్పులు ఎవరివో ఆ దేవుడికే తెలియాలి అంటున్నారు నెటిజన్లు.