Neru Review in Telugu: నెరు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మోహన్ లాల్ (Hero)
  • ప్రియమణి (Heroine)
  • అనస్వర రాజన్,సిద్దిఖీ, గణేష్ కుమార్, జగదీష్ తదితరులు (Cast)
  • జీతూ జోసెఫ్ (Director)
  • ఆంటోనీ పెరంబవూర్ (Producer)
  • విష్ణు శ్యామ్ (Music)
  • సతీష్ కురుప్ (Cinematography)
  • Release Date : జనవరి 23, 2024

మలయాళంలో గతేడాది చివర్లో అంటే డిసెంబర్ చివరి వారంలో ‘నెరు’ అనే సినిమా రూపొందింది. ప్రభాస్ నటించిన ‘సలార్’ కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సైలెంట్ గా రూ.100 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. మోహన్‌ లాల్‌ హీరోగా ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండటం, పైగా డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకి ఇంకా మంచి టాక్ రావడంతో అంతా ఎగబడి చూస్తున్నారు.

కథ: మహ్మద్‌ (జగదీశ్‌) దంపతుల ఏకైక సంతానం సారా (అనస్వర రాజన్‌). పెద్ద కుటుంబంలో జన్మించినప్పటికీ ఓ వ్యాధి వల్ల ఈమె చూపు కోల్పోతుంది. అందువల్ల ఈమె తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా పెంచుతారు.సారా అంధురాలైనప్పటికీ మనిషి స్పర్శ ద్వారా వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలాంటివి అనేది పసిగట్టగలదు. ఒక రోజు సారా తల్లిదండ్రులు బంధువుల ఇంటికి ఓ ఫంక్షన్ నిమిత్తం వెళ్తారు.అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న సారాపై గుర్తు తెలియని ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడతాడు. దీంతో న్యాయపోరాటానికి కోర్టుకెక్కుతుంది సారా. అయితే సారా పై అత్యాచారం చేసిన ఆ వ్యక్తి ఎవరో పోలీసులు కనిపెట్టలేరు.

ఆ టైంలో సారా స్పర్శ ద్వారా ఆ వ్యక్తి రూపం ఎలా ఉంటుంది అనేది బొమ్మ గీయిస్తుంది. అది ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త కొడుకు మైఖేల జోసెఫ్‌ కి దగ్గరగా ఉండటంతో అది సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలో మైఖేల్ తండ్రి ఓ పెద్ద లాయర్ ను నియమిస్తాడు. అయితే సారా తండ్రి విజయ్‌ మోహన్‌ (మోహన్‌ లాల్‌) ను సంప్రదిస్తాడు. సారా పట్టుదలను చూసి అతను ఈ కేసు వాదించడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత విజయ్ మోహన్.. ఆ కేసును ఎలా డీల్ చేశాడు. సారాకి న్యాయం జరిగిందా లేదా అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: మోహన్ లాల్ నటన గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏముంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు. ఈ సినిమాలో కూడా ఎప్పటిలానే తన నటనతో విజయ్‌ మోహన్‌ పాత్రకి న్యాయం చేశారు. అంధురాలి పాత్రలో అనస్వర రాజన్‌ పరకాయ ప్రవేశం చేసింది అని చెప్పాలి. ఆమె చాలా చక్కగా నటించింది. ఇంకో రకంగా గుర్తుండిపోయే పాత్ర చేసింది అని చెప్పవచ్చు.

ఇక ప్రియమణి, దినేష్‌ ప్రభాకర్‌, సిద్ధిఖ్‌లు తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. అయితే మోహన్ లాల్,అనస్వర రాజన్‌ పాత్రలే ఎక్కువగా గుర్తుంటాయి అని చెప్పాలి.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు జీతూ జోసెఫ్‌ సినిమా అంటే సింగిల్ పాయింట్ పైనే రన్ అవుతూ ఉంటుంది. కానీ దాని చుట్టూ అతను అల్లే చిక్కుముడులు చివరి వరకు కట్టిపడేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల థ్రిల్ చేస్తూ ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. ‘నెరు’ విషయంలో కూడా అదే జరిగింది. కథగా చెప్పుకుంటే ఇందులో పెద్దగా ఏమీ అనిపించదు. కానీ ఓ అంధురాలికి స్పర్శ ద్వారా వ్యక్తి స్వభావం, రూపాన్ని కూడా కనిపెట్టగలిగే నైపుణ్యం ఉంటాయి అనేది వినడానికి కొత్తగా అనిపించినా.

లాజికల్ గా అది సాధ్యమేనా? కానీ ఆ లాజిక్ జోలికి పోకుండా కథనాన్ని నడిపించాడు జీతూ. మొదట్లో కొంచెం స్లోగా సాగుతున్నట్టు అనిపించినా.. మెయిన్ ప్లాట్ కి వెళ్ళాక వచ్చే సర్ప్రైజ్.. లు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ కూడా కీ రోల్ పోషించింది అని చెప్పాలి. విష్ణు శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రొడక్షన్ డిజైన్ కూడా కథకు తగ్గట్టు ఉంది.

విశ్లేషణ: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ‘నెరు’ (Neru) బెస్ట్ ఛాయిస్. మొదట్లో స్లో అనిపించినా ఆ తర్వాత వచ్చే ట్విస్ట్..లు, సర్ప్రైజ్..లు ఆకట్టుకుంటాయి.

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus