సాధారణంగా సినిమా అనేది శుక్రవారం విడుదలవ్వడం అనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీని గత కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నారు మన దర్శకనిర్మాతలు. మరీ పండగ సీజన్ లేదా లాంగ్ వీకెండ్ అయితే తప్ప గురువారం లేదా బుధవారం విడుదల చేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు మనోళ్ళు. ఆమధ్య “హ్యాపీ వెడ్డింగ్” లాంటి చిన్న సినిమాను కూడా శనివారం విడుదల చేయడానికి నానా హడావుడీ పడ్డారు. కానీ.. త్రివిక్రమ్-అల్లు అర్జున్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో” చిత్రాన్ని మాత్రం ఆదివారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.ఆదివారం సినిమా రిలీజ్ ఏంటా అని అందరూ షాక్ అయినప్పటికీ.. సంక్రాంతి సీజన్ కావడంతో.. ఎలాగూ హాలీడే సీజన్ కాబట్టి ఆదివారం విడుదల చేసినా పర్వాలేదు అని భావించారట దర్శకనిర్మాతలు.
అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్స్ ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. టబు చాన్నాళ్ల తర్వాత ఈ చిత్రంతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. మరి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది అనేది చూడాలి.