Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ్ సక్సెస్ సెంటిమెంట్.. ఆలస్యమైనా అదృష్టమేనా..

టాలీవుడ్‌లో ఒక సినిమా విడుదల వాయిదా పడిందంటే నెగిటివ్ బజ్ రావడం సహజం. కానీ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ విషయంలో మాత్రం ఈ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సినిమా ఎంత లేట్ అయితే బాక్సాఫీస్ వద్ద అంత పెద్ద హిట్ అవుతుందనే ఒక వింతైన సెంటిమెంట్ ఆయన కెరీర్‌లో బలంగా వినిపిస్తోంది. ‘స్వామిరారా’ నుంచి మొదలైన ఈ వింత అనుబంధం నేటికీ కొనసాగుతుండటం విశేషం.

Nikhil Siddhartha

నిఖిల్ కెరీర్‌ను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. విడుదలకు ముందు ఇబ్బందులు పడిన ‘స్వామిరారా’ సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ వంటి చిత్రాలు కూడా అనుకున్న సమయానికి రాకుండా వాయిదాలు పడినా, థియేటర్లలో మాత్రం వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక ఏడాదిన్నర పాటు ల్యాబ్‌కే పరిమితమైన ‘అర్జున్ సురవరం’ బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా వండర్ ‘కార్తికేయ 2’ సైతం అనేకసార్లు వెనక్కి జరిగి, చివరకు రిలీజ్ అయి రికార్డులు తిరగరాసింది.

ప్రస్తుతం నిఖిల్ తన 20వ చిత్రం ‘స్వయంభూ’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వాస్తవానికి ఫిబ్రవరిలోనే విడుదల కావాలి. కానీ గ్రాఫిక్స్, క్వాలిటీ కోసం మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. ఈ తాజా పోస్ట్‌పోన్‌మెంట్ ఇప్పుడు నిఖిల్ పాత సెంటిమెంట్‌ను మళ్ళీ తెరపైకి తెచ్చింది. సినిమా లేట్ అయిందంటే చాలు నిఖిల్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్లేనని ఫిలిం నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

నిజానికి ఈ ‘వాయిదాల’ వెనుక నిఖిల్ పక్కా ప్లానింగ్ ఉంటుంది. కంటెంట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకపోవడం, అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా వచ్చేవరకు రిలీజ్ డేట్ గురించి ఆలోచించకపోవడం ఆయన శైలి. క్వాలిటీ కోసం తీసుకునే ఈ అదనపు సమయమే థియేటర్లో ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తోంది. అందుకే ‘స్వయంభూ’ కోసం తీసుకున్న ఈ ఎక్స్‌ట్రా టైమ్, ఏప్రిల్ 10న బాక్సాఫీస్ వద్ద నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus