శుక్రవారం వచ్చిందంటే ఇండస్ట్రీకి, సినిమా అభిమానులకు పండుగ లాంటిది. అలాంటిది ఈ శుక్రవారం (డిసెంబర్ 13) చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు అనుకుంటున్న తరుణంలో మధ్యాహ్నం అల్లు అర్జున్ ను (Allu Arjun) అరెస్ట్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీని, సోషల్ మీడియాని ఒక్కసారిగా కుదిపేసింది. అయితే.. అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు కాకుండా గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లడం, అక్కడినుండి డైరెక్ట్ గా కోర్ట్ కి తీసుకెళ్లడం, అక్కడ బెయిలుకు నిరాకరించడం, అక్కడి నుండి చంచల్ గూడజైలుకి తరలించడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి.
కట్ చేస్తే.. అల్లు అర్జున్ తరపున క్వాష్ పిటిషన్ ను వాదించడానికి రంగంలోకి దిగాడు ప్రొడ్యూసర్ కమ్ లాయర్ నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) . తెలంగాణ హైకోర్టులో తనదైన శైలి వాదనలతో అల్లు అర్జున్ కు అత్యవసర బెయిల్ మంజూరు అయ్యేలా చేశాడు. కేసు వాదించే తరుణంలో పోలీసులు కూడా అల్లు అర్జున్ ను చూడడానికి మొదటి అంతస్థుకి వెళ్లారు, అందుకే ఇలా జరిగింది అంటూ కోర్టులో హాజరైన పోలీసులు విస్తుబోయేలా చేసి, తన తోటి లాయర్లను నవ్వించాడు.
అలాగే.. షారుక్ ఖాన్ కు 2017లో ఇదే తరహా కేసులో బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కోర్టులో ప్రస్తావించి అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు అయ్యేలా చేయడంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో ఒక్కసారిగా నిరంజన్ రెడ్డికి సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగిపోయింది. అందరూ ఆయనకి ఎలివేషన్ ఇవ్వడం మొదలెట్టారు.
తెలుగులో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి “గగనం, క్షణం, ఘాజీ (Ghazi), వైల్డ్ డాగ్ (Wild Dog), ఆచార్య (Acharya) ” వంటి సినిమాలు నిర్మించిన నిరంజన్ రెడ్డి, రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసారు. సినిమా ఇండస్ట్రీలో ముందు నుండీ మంచి సత్సంబంధాలు కలిగిన నిరంజన్ రెడ్డికి ఈ కేసుతో ఆ రిలేషన్ మరింత బలపడింది. ఏదేమైనా ఈ శుక్రవారం హీరో నిరంజన్ రెడ్డి అని ఒప్పుకోవాల్సిందే.