రెమ్యూనరేషన్లో మార్పు ఉండదంటున్న రవితేజ!

మాస్ మహారాజ్ రవితేజ సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి సాహసమే  “రాజా ది గ్రేట్”. ఒక స్టార్ హీరోగా ఉన్న అతను అంధుడిగా నటించి సాహసం చేశారు. విజయం వరించింది. ఇప్పుడు కూడా మరో సాహోసోపేతమైన నిర్ణయం పై నిలబడ్డారు. సినిమాకి పదికోట్ల పారితోషికం కావాలని పట్టుబట్టారు. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నట్టు సమాచారం. అంత డిమాండ్ చేస్తుంటే అవకాశాలు తగ్గుతాయని కొంతమంది సూచిస్తున్నప్పటికీ వినిపించుకోవడం లేదంట. గతంలోనూ ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తే చాలా  సినిమాలు రవితేజ చేతి నుంచి జారిపోయాయి. అందుకే ఏడాది గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో దిల్ రాజు ఒప్పించి “రాజా ది గ్రేట్” చేశారు.

ఇది విజయం సాధించినప్పటికీ అంత డిమాండ్ చేయడం అతని కెరీర్ కి మంచిది కాదని పలువురు నిర్మాతలు చెబుతున్నారు. “రోజుకి వెయ్యి రూపాయల కోసం నటించిన సందర్భాలు ఉన్నాయి.. అప్పుడు మాట్లాడని వారు.. ఇప్పుడు సలహాలు ఇవ్వడం బాగాలేదు” అని రవితేజ మొహం మీదే చెబుతున్నట్టు టాక్. ప్రస్తుతం రవితేజ విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో  “టచ్‌ చేసి చూడు” సినిమా చేస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ మరింత జోష్ తో కనిపించనున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మూవీ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus