బెట్టింగ్ యాప్‌ల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో స్టార్ నటులు కొంతమంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రచార వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ కొన్ని రోజుల క్రితం రంగంలోకి దిగింది. 29 మంది నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. తాజాగా వారిలో కొంతమంది నోటీసులు జారీ చేసింది.
గతంలో ఈడీ చెప్పిన వివరాల ప్రకారం ఈ కేసులో నిందితుల జాబితాలో హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాశ్ రాజ్, నటి మంచు లక్ష్మి, హీరోయిన్లు నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, టీవీ యాంకర్లు శ్రీముఖి, శ్యామల ఉన్నారు. ఇందులో రానాను జూలై 23న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రకాష్ రాజ్‌ను జూలై 30న రమ్మనగా, మంచు లక్ష్మి ఆగస్ట్ 13న విచారణకు రావాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ ఆగస్టు 6న రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈడీ చెప్పిన వివరాల ప్రకారం.. నిందితులు జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365 లాంటి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారు. ఆ యాప్‌ల నిర్వాహకులు రూ.వేల కోట్ల డబ్బు కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలో సినిమా సెలబ్రిటలీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఆయా కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమోషన్లు చేసినందుకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు సెలబ్రిటీలకు హవాలా మార్గంలో డబ్బు పంపించారా అనే కోణంలో ఆరా తీస్తోంది.
అందులో భాగంగానే ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. మరి ఇందులో ఎంతమంది విచారణ హాజరవుతారు, ఎంతమంది వివిధ కారణాలు చెప్పి గైర్హాజరవుతారు అనేది చూడాలి. ఒకవేళ హాజరైతే తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.