జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయనున్న సినిమా ఏమిటి ? .. తారక్ అభిమానులతో పాటు సినీ వర్గీయులు దీనికి సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. యువ హీరోలు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు ఒకే చెబుతున్న ఈ సమయంలో యంగ్ టైగర్ అంత కూల్ గా ఎలా ఉన్నారు? ఫిలిం నగర్లో నలుగురు కలుసుకుని మాట్లాడుకుంటే అందులో ఈ టాపిక్ తప్పనిసరిగా ఉంటోంది.తారక్ చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్ లోకి వచ్చారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నారు.
ఇది వరకు డైరక్టర్ ని నమ్ముకొని కథ కూడా పూర్తిగా వినకుండా ఒకే చేయడం వల్ల అపజయాలు పలకరించాయని, అందుకే స్క్రిప్ట్ పూర్తిగా అయిన తర్వాత సంతృప్తి చెందితేనే ఆ ప్రాజక్ట్ కి సైన్ చేయడం ప్రస్తుతం యంగ్ టైగర్ పాలసీగా మారిందని అయన సన్నిహితులు చెబుతున్నారు. అంతే కాదు రొటీన్ కమర్షియల్ కథలను పక్కన పెడుతున్నారని వారు వివరించారు. అందుకే రచయిత వక్కంతు వంశీ చెప్పిన కథను తారక్ పక్కన పెట్టారని తెలిసింది. రీసెంట్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి యంగ్ టైగర్ కు కథ చెప్పారు. పటాస్, సుప్రీమ్ సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ చెప్పిన స్టోరీపై చర్చలు జరుగుతున్నాయి. మరికొంతమంది దర్శకులు కూడా కథలు చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ మాత్రం తొందర పడకుండా తన ఇమేజ్ కి భంగం కలగకుండా బలం ఉన్నకథ కోసం ఎదురుచూస్తున్నారు. అంతే కాదు తమిళం, తెలుగులో వర్కవుట్ అయ్యే స్టోరీ అయితే మరీ మంచిదని భావిస్తున్నట్లు తారక్ సన్నిహితులు స్పష్టం చేశారు.