హృద‌యాల్ని బ‌రువెక్కించి ఆత్మశోధ‌న కావించే ప్ర‌ణ‌య‌గాథ‌!

  • April 15, 2018 / 12:13 PM IST

హేమంత‌పు మంచు తెర‌ల్లో వెన్నెలధార‌ల న‌డుమ విక‌సించి ఉషోద‌యాన్ని క‌న‌క ముందే రాలిపోతాయి పారిజాత పుష్పాలు. వికాసం విలాపం మ‌ధ్య విరామం అతిస్వ‌ల్పం. కానీ వాటి ప‌రిమ‌ళాలు శీతాకాలామంతా ప‌ర‌చుకునే ఉంటాయి. ఆ అమ్మాయికి పారిజాతాలు ఇష్టం. త‌ను మంచువాకిట ప‌ర‌చుకున్న ఓ వెండి వెన్నెల‌. విప్పారిన క‌నుల‌లో క‌ల‌ల వెలుగులు. జీవితంపై ఎన్నో ఆశ‌లు. ఇంత‌లో విధి నిర్ద‌య‌. అనుకోని ప్ర‌మాదంలో కోమాలోకి వెళ్లిపోతుంది. జీవన చైత‌న్య స్ర‌వంతిలోకి రావ‌డానికి ప్రాణ‌ధార యంత్రాల న‌డుమ ఆసుప‌త్రిలో పోరాటం సాగిస్తుంటుంది. అత‌ను ఆమెకు స‌హ‌ధ్యాయి. ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి ప్రేమ లేదు.

కేవ‌లం వృత్తిప‌ర‌మైన సాన్నిహిత్య‌మే. అత‌ను క‌ల్లాక‌ప‌టం ఎరుగ‌ని స్వ‌చ్ఛ‌మైన హృద‌యుడు. ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్‌లో చెఫ్‌గా స్ధిర‌ప‌డాల‌న్న‌దే ల‌క్ష్యం. ప్ర‌మాదానికి ముందు అమె త‌న గురించి ఎందుకో గుర్తుచేసింద‌ని తెలుసుకుంటాడు. ఆమె ఏం చెప్పాల‌నుకున్న‌దో ఎవ‌రికీ తెలియ‌దు. మ‌ర‌ణ‌శ‌య్య‌పై ఆమెను చూపి చ‌లించిపోతాడు. స‌ప‌ర్య‌లు చేస్తాడు. మెల‌కువ‌లోకి వచ్చే అవ‌కాశాలు ఏమి లేవ‌ని అంటే…శ‌రీరం కొద్దికాలం ప‌నిచేయ‌క‌పోతే ఏమ‌వుతుంది? తిరిగి చైత‌న్యంలోకి రాదా? బైక్ ఒక్క‌సారి స్టార్ట్ కాక‌పోతే ఊరుకుంటామా? మ‌ర‌లా ప్ర‌య‌త్నించ‌మా? ఇది అంతే…అంటూ అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తాడు. ఆమెకు ఇష్ట‌మైన పారిజాతాల్ని ఐసీయూ గ‌దిలో తెచ్చిపెడుతుంటాడు. అత‌ని ప్రేమ ప‌రిమ‌ళాల్ని ఆఘ్రాణిస్తూ ఆమె మెల‌కువ‌లోకి వ‌స్తుంది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిల‌వ‌దు. పారిజాతం మాదిరిగానే వెలుగుల్ని చూడ‌క‌ముందే ఆమె త‌నువు చాలిస్తుంది.

అత‌ని చెక్కిళ్ల‌పై ఓ క‌న్నీటి ధార‌. త‌న కూతురి స‌ప‌ర్య‌లు చేసిందుకు త‌ల్లి అత‌ని కృత‌జ్ఞ‌త‌లు చెబుతుంది. ఇక ఇక్క‌డ ఉండ‌లేమ‌ని..తిరిగి త‌మ స్వంత ఊరు కేర‌ళ‌కు వెళ్లిపోతామ‌ని అంటుంది. ఇంటి పెర‌టిలో ఆమె పెంచుకున్నపారిజాత వృక్షం గురించి గుర్తుచేస్తుంది. స‌రేనంటాడు. ఓ ఆటోలో ఆ పారిజాత మొక్క‌ను తీసుకొని అత‌ను బ‌య‌లుదేరుతాడు ప్రేమ ప‌రిమ‌ళాల్ని మోసుకుంటూ.. అక్టోబ‌ర్‌- అమ‌లిన ప్రేమ‌కు అంద‌మైన దృశ్య‌రూపం. హృద‌యాల్ని బ‌రువెక్కించి ఆత్మశోధ‌న కావించే ప్ర‌ణ‌య‌గాథ‌.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus