సినిమాల్లో ఓ డైలాగ్ ఉంటుంది.. ‘నీ కష్టం పగోడికి కూడా రాకూడదు’ అని. ఇప్పుడు ఇదే మాటను ‘కమల్ హాసన్ (Kamal Haasan) – రజనీకాంత్ (Rajinikanth) సినిమా’కు కూడా అనొచ్చు అనిపిస్తోంది. దానికి కారణం ఈ కాంబినేషన్‌లో రూపొందాల్సిన సినిమాకు అలాంటి కష్టాలే వస్తున్నాయి. సినిమా కెప్టెన్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ఒక దర్శకుడు అనౌన్స్‌మెంట్ తర్వాత మారగా.. ఇప్పుడు రెండో దర్శకుడు కూడా మారారు అని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం.
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ కాంత్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రాజెక్ట్ నుండి ఆయన తప్పుకున్నారు. ఆ సమయంలో ‘డాన్’ సినిమా ఫేమ్ సిబి చక్రవర్తి ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఆయన కథ నచ్చిందని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఆ సమయంలో ఓ ఈవెంట్‌కి సిబి వెళ్తే అక్కడ హీరో శివకార్తికేయన్ హడావుడి కూడా చేశాడు.
అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఆ హడావుడి అంతా వేస్ట్ అని తేలింది. సిబి సిద్ధం చేసిన పూర్తి స్క్రిప్ట్‌కి రజనీ – కమల్ ఓకే చెప్పలేదట. అంతేకాదు ఈ విషయం తేలేలా లేదని.. తమ సినిమాకు వేరే దర్శకుడిని చూద్దాం అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో గతంలో ఇదే ప్రాజెక్ట్ కోసం పని చేసిన అశ్వత్ మరిముత్తుకు పిలుపు వచ్చిందట. గతంలో తానొక కథను రజనీ, కమల్‌కి వినిపించానని.. కానీ ముందుకు వెళ్లలేదు అని ఇటీవలే అశ్వత్ చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అశ్వత్ దగ్గరకు తిరిగి కథ వస్తే.. ‘ఎవరికి రాసి పెట్టి ఉన్నది వారికే దక్కుతుంది’ అనే మాట మరోసారి సినిమా పరిశ్రమలో నిజమవుతుంది. అయితే సిబి ఈ లోపు కథలో ఏమన్నా మార్పులు చేస్తే ఆయనే మెగాఫోన్ పట్టుకోవచ్చు.