Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

తెలుగు తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం రాజుకుంటోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ సతీమణి, డ్యాన్సర్స్‌ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత విషయంలో మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అంతేకాదు ఆ విభేదాలు పోలీసు స్టేషన్‌ వరకు చేరాయి. దీంతో మరోసారి టాలీవుడ్‌లో డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ మొదలైంది అని చెప్పొచ్చు. పరస్పర ఆరోపణలతో ఇండస్ట్రీలో ఈ పంచాయతీ హాట్ టాపిక్‌గా మారింది.

Dancers Association

ఆ మధ్య జానీ మాస్టర్‌ వర్గం, శేఖర్‌ మాస్టర్‌ వర్గం మధ్య విభేదాలు వచ్చాయి. అయితే తమ మధ్య ఏమీ లేదు అంటూ చిరంజీవి సమక్షంలో ఇద్దరూ భోజనం చేసి తేల్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు జరిగిన చర్చ, రచ్చకు కారణం శేఖర్‌ మాస్టర్‌ కాదు. ఈ సారి రంగంలోకి వచ్చింది ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌. ఆయన ప్యానెల్ సభ్యులు అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సుమలత రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

డ్యాన్సర్స్‌ యూనియన్ బ్యాంకు ఖాతాల నిర్వహణ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లు, తప్పుడు సంతకాలతో పత్రాలను బ్యాంకు అధికారులకు సమర్పించారని సుమలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసోసియేషన్ నిధులను, అధికారాలను అక్రమంగా చేజిక్కించుకునేందుకు వారు యత్నిస్తున్నారని మండిపడ్డారు. రఘు మాస్టర్ మాట్లాడుతూ.. సుమలత చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆమె కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.

తమ కొత్త కార్యవర్గాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధికారికంగా గుర్తించిందని రఘు మాస్టర్‌ స్పష్టం చేశారు. ఫెడరేషన్ ఇచ్చిన లేఖ ఆధారంగానే తాము నిబంధనల ప్రకారం బ్యాంకును ఆశ్రయించామని, బ్యాంకు అధికారులు అన్ని పత్రాలను పరిశీలించే అనుమతిచ్చారని ఆయన చెప్పారు. సుమలత వ్యవహారశైలి వల్ల డ్యాన్సర్స్ అసోసియేషన్ పరువు పోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి టాలీవుడ్‌ వర్గాల్లో కొరియోగ్రాఫర్ల ఇష్యూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయిపోయింది.

10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus