సినిమా రంగంలో మంచి క్రేజ్ ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ నటనకు బ్రేక్ ఇచ్చి, ప్రజలకు సేవ చేయాలనీ రాజకీయంలోకి అడుగుపెట్టారు. 2019 లో ఎన్నికలు దగ్గరపడడంతో పూర్తి సమయాన్ని ప్రజలమధ్య గడపాలని ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు… అతను మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. తన మేనల్లుడి కోసం కొన్నిరోజులు డేట్స్ కేటాయించనున్నట్లు టాక్. వివరాల్లోకి వెళితే… సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేయడానికి పనులు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ తో “గోపాల గోపాల”, “కాటమరాయుడు” సినిమాలను తెరకెక్కించిన కిశోర్ పార్ధసాని (డాలి) ఓ కథ సిద్ధం చేశారు.
ఆ కథతోనే వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నారు. ఆ సినిమాలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. దాన్ని పవన్‌తో చేయిస్తే సినిమాకి క్రేజ్ వస్తుందని డాలి అనుకుంటున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్ కి రామ్ మంచి మిత్రుడు. ఇలా డైరక్టర్ తెలిసిన వ్యక్తి.. నిర్మాత స్నేహితుడు.. హీరో మేనల్లుడు.. ఈ ముగ్గురి కోరిక మేరకు నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయాల్లోనే ఉంటూ.. ఈ సినిమాని పవన్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ వార్త పవన్ అభిమానులకు నిజంగా శుభవార్తే.