ఒకప్పుడు కథ రెడీ అయితే చాలు.. పూజా కార్యక్రమాలు చేసి ధైర్యంగా సెట్స్ మీదకు వెళ్లిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. దర్శకుడు యాక్షన్ చెప్పాలంటే.. ముందు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ‘ఓకే’ చెప్పాల్సిందే.
ఓటీటీ(OTT) సంస్థలు పెడుతున్న కొత్త రూల్స్ చూసి మన నిర్మాతలు ఇప్పుడు ఏమాత్రం రిస్క్ చేయడానికి సాహసించడం లేదు.కరోనా తర్వాత డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు కాసుల వర్షం కురిసిన మాట వాస్తవమే. కానీ ఆ స్పీడ్ ఇప్పుడు కనబడటం లేదు.
ఓటీటీ దిగ్గజాలు ఒక్కసారిగా బడ్జెట్లకు భారీగా కోత పెట్టేశాయి. అంతటితో ఆగకుండా.. రిలీజ్ డేట్స్ వాళ్లే డిసైడ్ చేయడం, డీల్ క్లోజ్ అయినా పేమెంట్స్ లేట్ చేయడం లాంటి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో మేకర్స్ పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు.అందుకే ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఓ కొత్త ఫార్ములా నడుస్తోంది. సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ముందే.. డైరెక్ట్‌గా స్క్రిప్ట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు పంపుతున్నారు. వాళ్లకు ఆ కథ నచ్చి, డీల్ ఫైనల్ అయితేనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నారు.
ఒకవేళ వాళ్లు ఏ చిన్న వంక పెట్టి రిజెక్ట్ చేసినా సరే.. ఏమాత్రం ఆలోచించకుండా ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేస్తున్నారు.ఇప్పుడు టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుండటం గమనార్హం. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటినీ ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టేశారు. డిజిటల్ డీల్ అప్రూవల్ రాకుండా ఒక్క రూపాయి కూడా ముందుగా ఖర్చు పెట్టకూడదని డిసైడ్ అయ్యారు.
కాకపోతే.. కేవలం టాప్ స్టార్స్ (పాన్ ఇండియా) సినిమాలకు మాత్రమే ఈ తలనొప్పి లేదు.వాళ్లవి మినహాయిస్తే.. మిగతా ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇప్పుడు ఓటీటీల కనుసన్నల్లోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది.