ఉగాది వచ్చినప్పుడు ఈ ఏడాది పేరు పరాభవ నామ సంవత్సరం అని అంటే.. అదేంటి పేరులోనే పరాభవం ఉంది.. ఈ ఏడాది ఎలా ఉంటుందో అనుకుని ఉంటారు కొందరు. మన సినిమా మనుషులం కాబట్టి.. ఈ ఏడాది సినిమాలకు ఎలాంటి ఇబ్బంది రావొద్దు అని అనుకుంటాం. అయితే పరాభవ నామ సంవత్సరం.. టాలీవుడ్‌లో వరుస పరాభవాలో ఉన్న నటులకు మంచి విజయాలు అందించింది. వారికి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది కూడా. ఇందులో వారు పడ్డ కష్టమే ఎక్కువనుకోండి. కానీ లక్ ఇలా కలిసొచ్చింది అన్నమాట.
టాలీవుడ్‌లో మార్చి 19 (ఉగాది) తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చూస్తే.. విజయాలు, కమ్‌బ్యాక్‌లు బాగా అర్థమవుతాయి. అయితే అదే రోజున విడుదలైన సినిమా మాత్రం డిజాస్టర్ అవ్వడం దురదృష్టం. అదేంటో ఆఖరున చూద్దాం.
* ‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్‌చరణ్ ఎంతో ఇష్టపడి/ కష్టపడి చేసిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న వచ్చి మంచి విజయం సాధించింది. నటుడిగా చరణ్‌కు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది.
* 94 ఏళ్ల దర్శకుడి నుండి సినిమానా అందులో ప్రయోగమా అంటూ అందరూ పెదవి విరిచిన ‘సింగ్ గీతం’ మంచి విజయం అందుకుని తెలుగు ప్రేక్షకులు ప్రయోగాలకు జేజేలు పలుకుతారని నిరూపించింది. (జూన్ 12)
* సమంత తెలుగు సినిమా చేయాలి.. మంచి విజయం సాధించాలి అని కోరుకునేవారికి ‘మా ఇంటి బంగారం’గా జూన్ 19న వచ్చి విజయం అందుకుంది. జనాలకు వినోదం అందించింది. రూ.100 కోట్ల వసూళ్లూ వచ్చాయి.
* సినిమాలు చేయడమే కానీ విజయం అందుకోవడం తెలియని స్టార్ కిడ్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న అఖిల్ అక్కినేని. తాను స్వింగ్‌లోకి వచ్చి సినిమా చేస్తే ఎలాంటి విజయం అందుతుందో జులై 10న ‘లెనిన్’ సినిమాతో చేసి చూపించాడు.
* ప్రేమకథలకు అందులోనూ మహిళా నేపథ్య ప్రేమకథలకు తెలుగులో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉందని నిరూపించింది ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమా విజయం టీమ్ అందరికీ చాలా అవసరమైన టైమ్‌లో వచ్చింది. (జులై 24)
* కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.. వరుణ్‌తేజ్‌కు చాలామంది చెప్పే సూచన ఇదే. ఇప్పుడు అదే పని చేసి లాంగ్ వెయిటింగ్ హిట్ కొట్టాడు ‘కొరియన్ కనకరాజు’ అలియాస్ కొణిదెల వరుణ్‌తేజు. ఇదంతా ఆగస్టు 7న జరిగింది.
* పాత రవితేజ కనిపిస్తున్నాడు కానీ.. హిట్ కొట్టడం లేదు అంటూ చాలా రోజులుగా ఆయన ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటూనే ఉన్నారు. పరాభవ నామ సంవత్సరం అది చేసి చూపించింది. ‘ఇరుముడి’తో వచ్చి ఇరగదీస్తున్నాడు మాస్ మహారాజ్.
చూద్దాం ఈ పరాభవ నామ సంవత్సరం ఇంకెంతమందిని పరాభవాల నుండి బయటపడేస్తుందో. ఎందుకంటే ఈ ఏడాది ఇలాంటి హీరోల సినిమాలు చాలానే వస్తున్నాయి.