‘పరాశక్తి’ సినిమా ఫలితం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ బాధపడుతున్నాం కానీ.. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌కి ముందు, చర్చల్లో ఉన్నప్పుడు ఈ సినిమా గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో తెలుసా? చాలా సినిమాలు వచ్చేసి, వెళ్తున్నాయి కాబట్టి అందరికీ గుర్తుండకపోవచ్చు కానీ.. సుధ కొంగర ఈ సినిమా ఆలోచనలో ఉన్నారు, కాస్టింగ్ పనులు చూస్తున్నారు అని టాక్ బయటకు వచ్చినప్పుడు బీభత్సమైన హైప్ ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఈ సినిమా గురించి వినిపించిన నటుల పేర్లు అలా ఉన్నాయి కాబట్టి.
వారందరూ కాకుండా శివకార్తికేయన్, శ్రీలీల, అధర్వ, రవి మోహన్‌ని ఎంచుకుని సినిమా స్టార్ట్ చేశారు సుధ కొంగర. అప్పటి నుండి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వచ్చిన హైప్ చూసి ‘ప్చ్.. వారంతా మిస్ చేసుకున్నారు’ అనే మాట వినిపించింది. అయితే ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. వాళ్లు మిస్ చేసుకోవడం కాదు.. వాళ్లంతా తప్పించుకున్నారు అని అంటున్నారు. సినిమా ఫలితం అంతలా వచ్చింది మరి. ఈ పీరియాడిక్ డ్రామా తమిళ ఆడియన్స్‌కి నచ్చలేదు.
ఒకప్పుడు తమిళనాడును ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో సినిమా తెరకెక్కించినా.. ఇప్పటి తరానికి అర్థమయ్యేలా ఆ కథను చెప్పడంలో దర్శకురాలు విఫలమయ్యారు. దీంతో ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇదంతా ఓకే తొలుత అనుకున్నది ఎవరిని అని అడుగుదాం అనుకుంటున్నారా? ఈ సినిమాకు సుధ కొంగర ఆలోచనలో మొదట వచ్చిన పేర్లు, చర్చలు జరిగిన పేర్లు సూర్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ. ఫహాద్ ఫాజిల్, నజ్రియా కూడా నటిస్తారని చెప్పారు. అయితే ఈ ప్రయత్నాలు తొలినాళ్లలోనే ఆగిపోయాయి.
వాళ్లంతా ఎందుకు ఈ సినిమా చేయలేదు అనే విషయంలో ఎక్కడా అధికారిక సమాచారం లేదు కానీ.. సినిమా కాన్సెప్ట్ లేనిపోని చర్చలకు, వివాదాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టే వద్దనుకున్నారని ఓ టాక్. ఏదేతైతేముంది ఇప్పుడైతే ఫ్లాప్ తప్పించుకున్నారు. శివకార్తికేయన్, శ్రీలీల లాంటి వాళ్లు దొరికిపోయారు.
ఇంకా లేట్.. ఏమవుతుందో ‘జననాయగన్’ ఫేట్?