ఈ “పెళ్లి చూపులు” ప్రత్యేకత ఏంటో?

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చూపులు అనేది ఓ మరిచిపోలేని ఘట్టం. కొందరికి అది మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే .. మరికొందరికి ఓ పీడకలగా అనిపిస్తుంది. అలాంటి అనుభవాలను సినిమాల్లో అనేకం చూసాం. ఇప్పుడు “పెళ్లి చూపులు” అనే పేరు మీదనే ఓ సినిమా రాబోతోంది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర టైలర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ  ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

నూతన దర్శకుడు: తరుణ్ భాస్కర్ దాస్యం. షార్ట్ ఫిల్మ్ చూసే వారికి ఈ పేరు బాగా పరిచయం. ఇతను విదేశాల్లో సినీరంగం పై కోర్సులు చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్ లు తీశారు. అందులో పూర్తి తెలంగాణ యాసలో రూపొందిన “సైన్మా” షార్ట్ ఫిల్మ్ నెటిజనులు విశేషంగా ఆకట్టుకుంది. దీంతో వెండి తెర అవకాశం కొట్టేశారు. రాజ్ కందుకూరి, ఎస్, రంగి నేని నిర్మాతలుగా “పెళ్లి చూపులు” అనే సినిమాను తెరకెక్కించారు.

ఫ్రెష్ స్టోరీ: ఎన్నో తిప్పలు పడి డిగ్రీ పూర్తి చేసి.. చిన్న ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడికి తల్లిదండ్రులు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. ఎంతో సంతోషంతో అమ్మాయిని చూసేందుకు వెళితే అక్కడ చేదు అనుభవం ఎదురవుతుంది. ఆ అమ్మాయి పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. తిరిగి వచ్చేద్దామనుకొనే లోపల.. మరో ఆఫర్ ఊరిస్తుంది. మొబైల్ రెస్టారెంట్ పెట్టి బిజినెస్ చేద్దామనే ఆలోచన ఉన్నట్లు చెబుతుంది. తనకి వంటలు చేయడం ఇష్టం ఉండడంతో ఒకే అంటాడు. ఇద్దరూ కలిసి ఓ వ్యాన్ లో కిచెన్ పెట్టి .. రోడ్డు సైడ్ ఫుడ్ విక్రయించేందుకు ప్రయాణమవుతారు. ఈ పయనంలో వీరిద్దరి జీవితాలు ఏ గమ్యానికి చేరుతుందనేది కథ. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలకు కొదవ లేదు కానీ.. తెలుగులో ఈ కాన్సెప్ట్ తో సినిమా రావడం ఇదే తొలిసారి.                                                           

పరిచయం ఉన్న నటులు: “పెళ్లి చూపులు” సినిమాలో హీరో ప్రశాంత్ పాత్రను విజయ్ దేవర కొండ పోషిస్తున్నారు. ఇతను ఇదివరకు ఎవడే సుబ్రమణ్యంచిత్రంలో నాని ఫ్రెండ్ రిషిగా నటించి ఆకట్టుకున్నారు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఇక కథానాయిక చిత్ర పాత్రను రీతూ వర్మ పండించనుంది. ఈమె ప్రేమ ఇష్క్ కాదల్ మూవీలో ఒక హీరోయిన్ గా నటించింది. చక్కని రూపం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలోనూ చాలా ఎనర్జిటిక్ గా నటించింది. ఇక 100 % లవ్, ఐస్ క్రీమ్ సినిమాల్లో సందడి చేసిన నటుడు ఆనంద కృష్ణ. నందుగా సినీ ప్రేక్షకులకు తెలిసిన ఇతను “పెళ్లి చూపులు” ఫిల్మ్ లో కీలక పాత్ర పోషించాడు.

హాయినిచ్చే సంగీతం: సినిమాకు సంగీతం ప్రాణం. పాటలు హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్లే. ఆ పనిని పక్కాగా పూర్తి చేశారు సంగీత దర్శకులు వివేక్ సాగర్. ఈయన స్వరపరిచిన గీతాలు సంగీత ప్రియుల మనసు దోచుకుంటున్నాయి. “మెరిసే మెరిసే మనసే మురిసే” పాట యూత్ గుండెల్లోకి చేరిపోయింది. సఖియే ఆనందమాయే సాంగ్ కొత్త ఫ్లేవర్ తో సాగి అలరిస్తోంది. అంతేకాదు చినుకు తాకే పాట రొమాంటిక్ టచ్ ఇచ్చింది. ఇలా పూర్తి ఆల్బం హాయినిస్తోంది.                                                                                                                                                                         

వీటితో పాటు “పెళ్లి చూపులు” సినిమాలో యూత్ మెచ్చే అంశాలు అనేకం ఉన్నాయని, ఈ చిత్రాన్ని కుటుంబం మొత్తం చూసి ఆనందిస్తారని నిర్మాతలు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus