ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితమే మొదలైనా ఇప్పటివరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తైంది. 2023 సంవత్సరం సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం అందుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉగ్రమ్ సినిమాకు రీమేక్ అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
అయితే ప్రభాస్ సలార్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు పోషించని పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. కేజీఎఫ్2 ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గురించి స్పందిస్తూ ప్రభాస్ రోల్ వైలెంట్ గా ఉంటుందని అన్నారు. సినిమాలో ప్రభాస్ క్రూరంగా వ్యవహరిస్తారని విలన్స్ విషయంలో ప్రభాస్ కఠినంగా ఉంటారని పేర్కొన్నారు.
తన సినిమాలలోని హీరోల పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఉంటుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. తన కామెంట్లతో ప్రశాంత్ నీల్ సలార్ పై అంచనాలు పెంచేశారు. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పేర్కొన్నాయి.
ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.