సినిమాకు హైప్ రావాలి అంటే.. అనౌన్స్‌మెంట్ వీడియో ఉండాలి, లేదంటే ఓపెనింగ్ రోజు స్పెషల్ వీడియోను రిలీజ్ చేయాలి అనేలా మారింది సౌత్ సినిమా పరిస్థితి. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఈ ఒరవడిని ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి అనుకున్నారో, లేక ఇదే సరైన విధానం అనుకున్నారో కానీ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మెయిన్ యాక్టర్లు వీరే, దర్శకులు వీరే.. అంటూ ఆ వీడియోలో చూపించారు. ఇప్పుడు ఈ వీడియో గురించి, సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆ వీడియో కాన్సెప్టే.
‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ లాంటి సినిమాలతో ప్రదీప్ రంగనాథన్ తానేంటి, తన టాలెంట్ ఏంటి? అనేది క్రిస్టల్ క్లియర్‌గా చూపించారు. ఇప్పుడు నిర్మాతగా మారిపోయారు. పీఆర్ షో అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి, అందులో రూపొందుతున్న మొదటి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీనికి ప్రదీప్ కథ కూడా ఇస్తున్నారు. ఇందులో ప్రముఖ కథానాయిక మమితా బైజు, యువ దర్శకుడు అశ్వత్ మరిముత్తు, సీనియర్ తెలుగు యాక్టర్ శివాజీ, శ్వాసిక, అనామిక మహి ముఖ్య పాత్రధారులు.
ఇక అసలు ట్విస్ట్ విషయానికొస్తే.. ఈ సినిమాను ఆరుగురు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ‘ది ఆల్ఫా యూనిట్’ అనే పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సౌత్ సెన్సేషనల్ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పలేదు కానీ.. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గానే ఉంటుంది అంటున్నారు. అయితే దీనికి చిన్న క్రైమ్ టచ్ ఇస్తున్నారు అని సమాచారం. దర్శకుడిగా, హీరోగా ఇప్పటికే రాణించిన ప్రదీప్.. నిర్మాతగానూ తనదైన మార్కు వేయబోతున్నాడు అనిపిస్తోంది ఈ వీడియో చూశాక.
అన్నట్లు ఇది సినిమా ముహూర్తం/ ఓపెనింగ్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో కాదని టాక్. సినిమా చిత్రీకరణ చివరిదశకు వచ్చిందని సమాచారం. ఈ పనులు అయిపోయాకనే అశ్వత్ మరిముత్తు.. రజనీకాంత్ సినిమా పనుల్లోకి వచ్చారట.