వరుస పరాజయాల అనంతరం “చిత్రలహరి”తో మంచి హిట్ అందుకున్న సాయి తేజ్ ఆ సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగించే ప్రయత్నంలో నటించిన తాజా చిత్రం “ప్రతిరోజూ పండగే”. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ మొదలుకొని ట్రైలర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి.. మరి సినిమా కూడా అదే స్థాయిలో అలరించిందో లేదో చూద్దాం..!!
కథ: అమెరికా నుంచి హుటాహుటిన రాజమండ్రి వస్తాడు సాయి తేజ్ (సాయి తేజ్). అమెరికాలో తండ్రి బిజినెస్ లు చూసుకుంటున్న సాయితేజ్ అంత అర్జెంట్ గా రాజమండ్రి రావడానికి కారణం అతని తాతయ్య (సత్యరాజ్). నలుగురు పిల్లలున్నా.. తన దగ్గర ఎవరు లేకపోవడం, తనను చూడడానికి కూడా పిల్లలకు ఖాళీ లేకపోవడంతో మానసికంగా కృంగిపోతాడు. అలాంటి తరుణంలో తనకు లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది.
ఆఖరి రోజుల్లో తాతయ్యను ఆనందంగా ఉంచడమే మనవడు సాయితేజ్ టార్గెట్. ఆ టార్గెట్ లో భాగంగా టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా (రాశిఖన్నా)ను ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
ఈ క్రమంలో సాయితేజ్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? చివరికి సాయితేజ్ తన తాతయ్యకు తన పిల్లలతో గడపాలన్న లోటును తీర్చాడా? ఇందులో మెలిక ఏమిటి? అనేది “ప్రతిరోజూ పండగే” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: సాయితేజ్ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా, కొత్త లుక్ తో కనిపించాడు. కామెడీ సీన్స్ కంటే ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల్ని బాగా మెప్పించాడు. సత్యరాజ్-సాయితేజ్ ల నడుమ తాత-మనవడు కెమిస్ట్రీ భలే వర్కవుట్ అయ్యింది. ఆ ఏజ్ వాళ్ళందరూ ఈ పాత్రలకి బాగా కనెక్ట్ అవుతారు.
తాను ఎలాంటి పాత్రలోనైనా జీవించగలను అని సత్యరాజ్ మరోసారి ప్రూవ్ చేసుకొన్నారు. అలాగే.. రావు రమేష్ లోని ఫుల్ పొటెన్షియల్ ను మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రమిదే. రావు రమేష్ లోని కామెడీ, ఎమోషనల్ యాంగిల్ ను మారుతి బాగా వాడుకున్నాడు.
టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నాగా రాశిఖన్నా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోయిన్ గా ఆకట్టుకొంది. మునుపటి చిత్రాలతో పోల్చి చూస్తే.. గ్రామీణ యువతిగా లంగాఓణిలో రాశి మరింత అందంగా అలరించింది. ఎమోషన్స్ లోనూ తన సత్తా చాటుకొంది. ఆర్నా పాత్ర ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ పాత్రల్లో ఒకటిగా నిలుస్తుంది.
హరితేజ కామెడీ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. సత్యం రాజేష్-అజయ్ ల పాత్రలు ఇంకాస్త బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతికవర్గం పనితీరు: తమన్ పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. చిన్నతనమే, ఓ బావా సాంగ్స్ కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాయి. జయరాజ్ సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. కాకపోతే.. ఎమోషనల్ సీన్స్ ను కూడా మరీ బ్రైట్ గా చూపించడంతో.. సన్నివేశంలోని ఎమోషన్ తెరపై పండలేదు.
ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త నిక్కచ్చిగా ఉంటే బాగుండేది.
దర్శకుడు మారుతి కథ కంటే కథనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు.. అతను మొదటి సినిమా నుంచి ఫాలో అవుతున్న ఫార్ములా ఇదే. అయితే.. “భలే భలే మగాడివోయ్” సినిమా విషయంలో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. “ప్రతిరోజూ పండగే”లో అది మిస్ అయ్యింది. ప్రతిరోజూ పండగే అనే టైటిల్ కి జన్స్టిఫికేషన్ ఇచ్చిన విధానం బాగుంది, ప్రతి నటుడి నుండి చక్కని నటన రాబట్టుకున్న విధానం కూడా బాగుంది. కానీ.. కామెడీతో ప్రేక్షకుల్ని అలరించిన మారుతి అదే ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా సినిమాలో ఇన్వాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఏదో రెండు ఫైట్లు ఉండాలి కాబట్టి సత్యం రాజేష్-అజయ్ పాత్రలు పెట్టినట్లుగా ఉంటుంది తప్పితే.. ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఏమీ ఉండదు. ఇక సెంటిమెంట్ క్లైమాక్స్ కాస్త బెడిసికొట్టింది. ట్విస్ట్ తో ఆకట్టుకొందామని మారుతి చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నివ్వలేదు.
విశ్లేషణ: సాయితేజ్-సత్యరాజ్ ల కాంబినేషన్ లో వర్కవుటయిన కెమిస్ట్రీ & కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్ కోసం “ప్రతిరోజూ పండగే” చిత్రాన్ని తప్పకుండా ఒకసారి చూడవచ్చు. అయితే.. కథలో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండుంటే.. మారుతికి మరో “భలే భలే మగాడివోయ్” స్థాయి విజయం దక్కేది. ఆ కెనెక్షన్ మిస్ అవ్వడంతో ఈ చిత్రం యావరేజ్ హిట్ గా మిగిలిపోయింది. సాయితేజ్ కి మాత్రం ఈ సినిమా ప్లస్ అనే చెప్పాలి.
రేటింగ్: 2.5/5