ఒక దర్శకుడు వంద సినిమాలు చేయడమే పెద్ద విషయమే. ఈ ఫీట్ చేసిన దర్శకులు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే తక్కువ ఉన్నారు. అలాంటిది తన మొదటి సినిమా చేసిన హీరోతోనే ఇప్పుడు వందో సినిమా కూడా చేస్తున్నారు అంటే పెద్ద విషయమే కదా. ఒకటో, వందో సినిమా చేస్తున్న ఆ దర్శకుడు ప్రియదర్శన్ కాగా.. ఆ ఘనతలో భాగమై, మరో ఘనత సృష్టించిన హీరో మోహన్ లాల్. ఇప్పుడు ఈ విషయమే వైరల్ అవుతోంది.
తన వందో సినిమాను మోహన్ లాల్ తోనే చేస్తానని గతంలోనే చెప్పారు ప్రియదర్శన్. అలా చెప్పినట్లుగానే సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. సినిమాను ప్రకటిస్తూ మోహన్‌లాల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సినిమా పట్ల ప్రియదర్శన్‌కు ఉన్న ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది అంటూ పొగిడేశారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో తానూ ఓ భాగం కావడం ఆనందంగా ఉందంటూ పొగిడేశారు.
‘పూచక్కోరు మూక్కుతి’ అనే సినిమాతో ప్రియదర్శన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరో మోహన్‌లాల్. 1984 వచ్చిన ఈ సినిమా హిట్ కావడంతో ప్రియదర్శన్ – మోహన్‌లాల్ కాంబినేషన్‌కి హిట్ కాంబో అనే క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వీరి కలయికలో ‘కాలాపానీ’, ‘మిన్నరం’, ‘మరక్కర్’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘ఒప్పమ్’ అనే సినిమాను చేస్తున్నారు.
మలయాళం, హిందీ, తమిళం, తెలుగులో ప్రియదర్శన్ సినిమాలు చేశారు. తెలుగులో ఆయన తెరకెక్కించిన ‘నిర్ణయం’, ‘గాండీవం’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌లు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా ‘భూత్‌బంగ్లా’ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక ‘ఒప్పమ్’ పనులు ప్రారంభమవుతాయి అని చెబుతున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్‌లో సీనియర్ స్టార్లు, యంగ్‌స్టార్‌లు చాలా మంది అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.