ఒక పెద్ద సినిమాలో నటిస్తున్న యాక్టర్ వేరే సినిమా వస్తోంది అంటే.. ఆ పెద్ద సినిమా హీరో ఫ్యాన్స్‌కి పండగే. అదీనూ ఆ సినిమా మల్టీస్టారర్, పాన్ ఇండియా, పెద్ద దర్శకుడి సినిమా అయితే డబుల్ పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చే హీరో.. కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతారు కాబట్టి. అలా ఇప్పుడు ‘వారణాసి’ సినిమా గురించి.. ఆ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మరో సినిమా ‘ఐ, నోబడీ’ ప్రచారంలో భాగంగా ‘వారణాసి’ ముచ్చట్లు వచ్చాయి.
మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కుంభ అనే ప్రతినాయక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి చెబుతూ.. ‘ఎంపురాన్’ సినిమా షూటింగ్‌లో ఉండగా ‘కాల్ చేయవచ్చా’ అని రాజమౌళి మెసేజ్ చేశారట. వెంటనే పృథ్వీరాజ్ ఆయనకు ఫోన్ చేశారట. ప్రస్తుతం ఓ కథ సిద్ధం చేశాం.. అందులో విలన్ పాత్ర బాగుంటుంది. మీకు ఆసక్తి ఉంటే కథ వినండి అని అన్నారట.
‘ఎంపురాన్’ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే హైదరాబాద్ వచ్చిన కథ విన్నారట. దాదాపు మూడున్నర గంటల పాటు అద్భుతంగా, ఒక సినిమా చూపించినట్లు కథ చెప్పారట. ఓ గంట తర్వాత రూమ్ చాలా చల్లగా ఉంది అనిపించింది. అయితే మధ్యలో ఆపమనడం భావ్యం కాదనిపించి అలానే ఉండిపోయారట పృథ్వీరాజ్. తనకు చలిగా ఉంటే, కథ చెప్పటం పూర్తయ్యే సమయానికి రాజమౌళి చొక్కా చెమటతో తడిసిపోయిందని పృథ్వీరాజ్ చెప్పారు.
మొన్నీమధ్య మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా టేక్‌ల విషయం మాట్లాడారు. ఒక షాట్ కోసం తాను, మహేశ్ బాబు ఉదయాన్నే సెట్స్‌కి వచ్చారట. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్క షాట్ కోసమే షూట్ చేశారట. సుమారు 100 టేక్‌లు అయినా ఆ షాట్ అవ్వలేదట. సాయంత్రం అయిపోయేసరికి.. ప్యాకప్.. దీన్ని రేపు ఉదయం మళ్లీ చేద్దాం అని అన్నారని పృథ్వీరాజ్ చెప్పిన విషయం మీకు తెలిసే ఉంటుంది.