సంవత్సరాన్ని నెలలతో కాకుండా సినిమాలతో కొలిచే డైరక్టర్ పూరి జగన్నాథ్. అపజయం ఎదురైనా బాధపడరు కానీ తన సినిమా మేకింగ్ ఆలస్యమైందంటే మాత్రం పూరి ఒప్పుకోరు. ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అతనితో మెహబూబా అనే సినిమాని తీస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హిమాచల్ ప్రదేశ్ లో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అందమైన లవ్ స్టోరీ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొడుకు సినిమా కదా.. చెక్కుతూ కూర్చుంటారని అనుకుంటే పొరపాటే.
ఈ సినిమాకి త్వరలోనే పేకప్ చెప్పనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. దీని తర్వాత చేయబోయే సినిమాని కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. మెహబూబా మూవీ షూటింగ్ గ్యాప్ లో కథ రాయడం.. దానిని వెంకటేష్ కి వినిపించడం.. అతన్నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకోవడం కూడా జరిగిపోయాయంట. మెహబూబా వర్క్ కంప్లీట్ అయిన వెంటనే వెంకీ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ కానున్నారు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే గురు మూవీ తర్వాత తేజ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. దీని తర్వాత పూరి దర్శకత్వంలో వెంకీ నటించనున్నారు.