‘పుష్ప’రాజ్ హంగామా రెండు సినిమాలతోనే ముగియదని, ఈ సిరీస్‌లో ఇంకో సినిమా కూడా ఉంటుందని చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే అప్పుడు ఈ విషయంలో టీమ్ పెద్దగా స్పందించింది లేదు. దీంతో ఉంటుందా? ఉండదా అనే ప్రశ్న కొన్ని రోజలు ఉండి ఆ తర్వాత ఆగిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి మూడో ‘పుష్ప’రాజ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీమ్ ప్లాన్స్, షూటింగ్ సాగుతున్న విధానం చూస్తుంటే రెండు పార్టులు కాదు మూడు పార్టులు అని అంటున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో సినిమా మూడో పార్టు పేరు కూడా ఫిక్స్ అంటూ ఓ టైటిల్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అదే ‘పుష్ప: ది రోర్’. అంటే ‘పుప్ప: ది రైజ్’ అయిపోయాక ‘పుష్ప: ది రూల్’ వస్తున్నట్లు ఇది అయిపోయాక ‘పుష్ప: ది రోర్’ అంటూ మూడో పార్టు వస్తుందని వారి లెక్క. ఈ విషయంలో ఏది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ.. సినిమా రెండో పార్టు క్లైమాక్స్‌కి వచ్చేసరికి చెప్పాల్సిన కథ ఇంకా చాలా ఉంది అని అనుకుంటున్నారట.
థియేటర్లలో పుష్పరాజ్ మేనియా చూపించడానికి రెండు పార్టులు సరిపోవని, (Pushpa 3) మూడో పార్టు కూడా ఉంటే ఫుల్ ఫిల్ అవుతుందని టీమ్ ప్లాన్ చేస్తోందట. అయితే ఈ విషయంలో సినిమా సన్నిహిత వర్గాల నుండి ఎలాంటి సమాచారం లేదు. అయితే బన్నీ మాత్రం ఇంత త్వరగా ‘పుష్ప’ రాజ్ గెటప్ నుండి బయటకు వచ్చే అవకాశం లేదని సన్నిహితుల కామెంట్. అవి పట్టుకునే ‘పుష్ప: ది రోర్’ రెడీ చేస్తారు అని చెబుతున్నారు. ఈ మేరకు లెక్కల మాస్టారు సుకుమార్ తన టీమ్‌కు అప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు అని కూడా టాక్.
‘పుష్ప 2’లో కొత్త విలన్లు వస్తారని, వారితో పోరాటంతో ఆ పార్టు అయిపోతుందని… షెకావత్, పుష్ప మధ్య వైరం తేలేది మూడో పార్టులో అని కూడా అంటున్నారు. ఆ మేరకు కొత్త హీరోయిన్ ఎంట్రీ కూడా ఉంటుందని టాక్. ఏమో ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ‘పుష్ప 2’ ప్రచారం మొదలవ్వాల్సిందే. అది రావాలంటే కనీసం జులై రావాల్సిందే.