నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, హీరోగా నిలదొక్కుకుంటున్న సుహాస్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”. గోదావరి జిల్లాలో జరిగిన ఓ నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా దుష్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయమయ్యాడు. పలు షార్ట్ ఫిలిమ్స్ తో నెటిజన్స్ కు సుపరిచితురాలైన శివానీ నాగారం హీరోయిన్ గా డెబ్యూ చేసిన ఈ సినిమాకి పాటలు, ట్రైలర్ మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. మరి సినిమా అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!
కథ: మల్లిగాడు (సుహాస్) అంబాజీపేటలోని బ్యాండ్ గ్యాంగ్ లో ఒకడు. ఊర్లో ఏ ఫంక్షన్ అయినా, మల్లిగాడు బ్యాండ్ లేకుండా అవ్వదన్నమాట. అలాంటి మల్లిగాడు.. ఆ ఊరికి పెద్ద లాంటి వెంకట్ బాబు గారు (నితిన్ ప్రసన్న)తో తలపడాల్సి వస్తుంది. అందుకు కారణం తనకంటే అయిదునిమిషాల ముందు పుట్టిన తన అక్క పద్మ (శరణ్య ప్రదీప్).
అసలు పద్మ & వెంకట్ మధ్య ఉన్న గొడవ ఏమిటి? మధ్యలో మల్లిగాడు ఎందుకు దూరాల్సి వచ్చింది? ఈ పర్యవసానాలు మల్లిగాడి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? వంటి ప్రశ్నలకు సమాధానమే “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” కథాంశం.
నటీనటుల పనితీరు: ఈ సినిమాలో అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయినప్పటికీ.. అందరినీ డామినేట్ చేసిన నటి మాత్రం శరణ్య ప్రదీప్. ఆత్మస్థైర్యం ఉన్న మహిళగా ఆమె కళ్ళల్లో చూపే తెగువ, మాటలో వేడి, బాడీ లాంగ్వేజ్ లో హుందాతనం సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాయి. ఇప్పటివరకూ ఆమెను ఈ తరహా పాత్రలో చూడని జనాలకి ఆమె నటన చిన్నపాటి షాక్ ఇస్తుంది. సాధారణంగా హీరో లేదా విలన్ సీన్స్ కి విజిల్స్ పడుతుంటాయి. కానీ.. పోలీస్ స్టేషన్ లో శరణ్య కాలెత్తి తన్నినప్పుడు పడే విజిల్స్ కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఎప్పుడో “ఫిదా” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. ఆమెలోని నటిని పూర్తిస్థాయిలో పరిచయం చేసింది మాత్రం పద్మ పాత్ర అని చెప్పాలి. ఈ పద్మ పాత్ర ఆమెకు ఎన్నో పురస్కారాలను తెచ్చిపెడుతుంది.
ఒక సినిమాలో ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే కథానాయకుడి స్థాయి ఆ రేంజ్ లో పెరుగుతుంది అనే సిద్ధాంతానికి సరైన ఉదాహరణగా నిలుస్తాడు నితిన్ ప్రసన్న. కుల, డబ్బు, అధికార మదం పట్టిన పల్లెటూరి ఆసామిగా అతడి హావభావాలు & నటన సినిమాలో ప్రేక్షకులు లీనమవ్వడానికి దోహదపడ్డాయి. విలన్ గా అతడికి మంచి భవిష్యత్ ఉంది.
నటుడిగా సుహాస్ ఇప్పటికే తన సత్తాను పలుమార్లు చాటుకున్నాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు కొట్టించుకోవడం అనేది అభినందించాల్సిన విషయం. అయితే.. హావభావాల ప్రకటన విషయంలో కాస్త వైవిధ్యత చూపాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో సుహాస్ నటన రిపిటీటివ్ గా ఉంది. ఈ విషయంలో అతడు జాగ్రత్తపడగలిగితే గనుక.. తెలుగులో ప్రామిసింగ్ హీరోగా ఎదిగే అవకాశం ఉంది.
శివాని నాగారం ఇదివరకే షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఉండడం, క్లాసికల్ డ్యాన్సర్ అవ్వడం వలన్ చక్కని అభినయంతో ఆకట్టుకుంది. తెలుగు తెరకు పరిచయమైన మరో మంచి తెలుగందంగా ఆమెను పేర్కొనవచ్చు.
జగదీష్ ఒక సిన్సియర్ లవర్ గా ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, సురభి ప్రభావతి తదితరులు అలరించారు.
చివరిగా చెప్పుకోవాల్సింది వినయ్ మహదేవ్ గురించి. ఒక నెగిటివ్ క్యారెక్టర్ మీద జనాలకి ఎంత చిరాకు వస్తే ఆ క్యారెక్టర్ అంత సక్సెస్ అయినట్లు. ఈ సినిమాలో వెంకట్ తమ్ముడిగా వినయ్ మహదేవ్ క్యారెక్టర్ అలాంటిదే.
సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఈ సినిమాకి టెక్నికల్ హీరో అని చెప్పాలి. పాటలు, నేపధ్య సంగీతంతో సినిమాకి మెయిన్ ఎస్సెట్ లా నిలిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కి శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీయమ్ మనసుకి హత్తుకుంటుంది. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాను కుదిరినంత సహజంగా చూపించడానికి ప్రయత్నించాడు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కంటెంట్ ను మరో స్థాయికి తీసుకెళ్లలేకపోయినా.. సహజత్వానికి లోటు లేకుండా చేశాయి.
దర్శకుడు & కథకుడు దుష్యంత్ కటికనేని కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా రాసుకున్న కథలో మంచి బలమున్నప్పటికీ.. ఆ కథను నడిపించిన విధానం కాస్త పేలవంగా ఉండడం చిన్నపాటి మైనస్ అని చెప్పాలి. అయితే.. దర్శకుడిగా దుష్యంత్ సినిమాలో పద్మ, వెంకట్ క్యారెక్టర్స్ ను రాసుకున్న విధానం, ఆ పాత్రధారులైన శరణ్య, నితిన్ ప్రసన్న నుండి నటనను రాబట్టుకున్న తీరు మాత్రం ప్రశంసనీయం. అయితే.. సబ్ ప్లాట్ అయిన హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ మాత్రం సరిగా వర్కవుటవ్వలేదు. అలాగే.. స్టోరీ ఆర్క్ మీద ఇంకాస్త శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది. తెలుగులో కుల, వర్గ బేధాల మీద సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి, ఆ లోటును భర్తీ చేసిన సినిమాగా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” నిలిచిపోతుంది. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త వర్కవుట్ చేసి ఉంటే మరో మరపురాని సినిమాగా మిగిలిపోయేది. అయినప్పటికీ.. దర్శకుడిగా, కథకుడిగా దుష్యంత్ కు ఇది మంచి డెబ్యూ ఫిలిమ్ అని చెప్పాలి.
విశ్లేషణ: ఓ సినిమాకి అసలేం ఆశించకుండా వెళ్లినప్పుడు, ఆ సినిమా కనీస స్థాయిలో ఉన్నా కూడా విశేషమైన సంతృప్తి చెందుతుంటాం. అలాంటి కోవకు చెందిన సినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”. ఏదో లవ్ స్టోరీ ఏమో, కుల విబేధాలు ఉంటాయేమో అని ఊహించివెళ్ళినవారికి.. ఆత్మాభిమానం కోసం ఓ కుటుంబం చేసిన యుద్ధం తెరపై కనిపిస్తుంది. సానుభూతి కాదు సమానత్వం కోరుకునే ఓ మహిళ తెగువను చూసి మనసుకు తెలియని ఓ సంతృప్తి.