బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా మాత్రమే కాక ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన చిత్రంగా నిలిచిన “క్వీన్“ను రీమేక్ చేద్దామని ఆ సినిమా విడుదలైనప్పట్నుంచి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎట్టకేలకు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజీమా మోహన్ లు కథానాయికలుగా సెలక్ట్ చేయడం, తెలుగు వెర్షన్ కు నీలకంఠ, కన్నడ, తమిళ వెర్షన్స్ కు నటుడు రమేష్ అరవింద్ లను దర్శకులుగా ఎంపిక చేయడం, నాలుగు భాషల చిత్రాలను సదరు సిటీల్లో ప్రారంభించడం, అందరూ షూటింగ్ కోసం లండన్ వెళ్ళడం, అక్కడ ఒక లాంగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేయడం కూడా పూర్తయ్యింది.
కట్ చేస్తే.. తెలుగు వెర్షన్ హీరోయిన్ తమన్నాకి, డైరెక్టర్ నీలకంఠకి క్రియేటివ్ డిఫరెన్సస్ వచ్చాయి. తర్వాత కొందరు పెద్దలు సర్దిచెప్పడంతో కొన్నాళ్లపాటు షూటింగ్ బ్రేక్ వచ్చినా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. కానీ.. తమన్నాకి మాత్రం కోపం తగ్గకపోవడంతో నీలకంఠ తానే స్వయంగా ప్రొజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. దాంతో ఆల్రెడీ తమిళ, కన్నడ వెర్షన్స్ ను హ్యాండిల్ చేస్తున్న రమేష్ అరవింద్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ “క్వీన్”ను నిర్మాతలు హోల్డ్ లో పెట్టారట. తమన్నాతో దర్శకుడు నీలకంఠకు ఉన్న సమస్యలు సమసిపోయేంతవరకూ తెలుగు వెర్షన్ మినహా అన్నీ వెర్షన్స్ షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. మరి తెలుగు రీమేక్ అనేది ఎప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుందో తమన్నాకే తెలియాలి.