హీరోగారూ.. సినిమాలో కాస్త పేస్ తగ్గుతోంది.. ఏం చేద్దాం? డైరక్టర్ గారూ.. థియేటర్‌లో జనం ఊగాలి.. ఏం చేద్దామంటారు? సినిమా వైబ్ కాస్త డౌన్ ఉంది మాస్టారూ.. ఏం చేద్దాం మరి.. ఈ ప్రశ్నలకు ఒకప్పుడు ఏం సమాధానం వచ్చేదో తెలియదు కానీ.. ఇప్పుడు అయితే ఒకే ఒక సమాధానం ఓ హిట్ ‘సింగిల్’/ పాట పట్టు అని ఆ మధ్య ఫిల్మీ ఫోకస్‌లో అంటే.. అలా ఎలా సాధ్యం అని అనుకున్నారు కొందరు.
కానీ మేం చెప్పేది నిజం అనేలా.. ఇప్పుడు హిట్ సింగిల్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీదన సందడి చేయబోతోంది. ఈసారి కూడా ఇది దేవుడి పాటే కావడం గమనార్హం. కొన్ని ఏళ్ల క్రితం ‘ధమకా’ సినిమాలో పల్సర్ బైక్ రమణ పాట పెట్టేసి వైబ్ పట్టేసిన రవితేజ.. ఇటీవల ‘ఇరుముడి’ సినిమాలో ‘మల్లెపూల పల్లకి..’ అని సాగే అయ్యప్ప స్వామి పాటను పెట్టేశారు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలు వచ్చినట్లు డ్యాన్స్ చేసి సినిమాకు హిట్ మార్కులు వేసేశారు.
ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేశారు నాని – శ్రీకాంత్ ఓదెల. ‘ప్యారడైజ్’ సినిమా కోసం ‘ఏష నాగుల..’ అంటూ సాగే ఈ పాటను ఏరి కోరి పెట్టారు విజయం సాధించారు. వీరికి ఫాలో అవుతూ.. కిరణ్ అబ్బవరం ఓ హిట్ సింగిల్ సాంగ్‌ను పట్టుకున్నారని సమాచారం. తనే డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న సినిమా కోసం ఫోక్ సాంగ్ ‘రఘుకుల తిలక రారా.. ’ అనే పాట రైట్స్ తీసుకున్నారట. ఈ పాటకు సంగీత దర్శకుడు భీమ్స్ సొగసులు అద్దే పనిలో ఉన్నారట.
అయితే అప్పటికే హిట్ అయిన పాటను తన సినిమాలో వాడుకోవడం, ఆ పాటను సినిమాను ట్రెండింగ్‌లోకి తీసుకురావడం కిరణ్‌కు కొత్త కాదు. ‘కేర్యాంప్’ సినిమాలో ‘ఇదేమిటమ్మా మాయ..’ అనే పాటను ఎలా వాడుకున్నారో అంతా చూశారు. కాబట్టి ఇప్పుడు ‘రఘుకుల తిలకా రారా..’ పాటను అలానే వాడేస్తారన్నమాట.