Raja Vikramarka Review :రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 12, 2021 / 04:53 PM IST

“ఆర్ ఎక్స్ 100” ఫేమ్ కార్తికేయ కథానాయకుడిగా, ప్రఖ్యాత తమిళ నటులు రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ కథానాయికగా వినాయక్ అసిస్టెంట్ శ్రీ సారిపల్లి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “రాజా విక్రమార్క”. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి పెంచాయి. యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!!

కథ: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లో కీలక సభ్యుడు రాజా విక్రమార్క (కార్తికేయ). తన సూపర్ బాస్ (తనికెళ్ళ భరణి) సారధ్యంలో ఓ సీక్రెట్ మిషన్ లో భాగంగా హోమ్ మినిస్టర్ కూతురు కాంతి (తాన్య రవిచంద్రన్) కు బాడీ గార్డ్ గా ఉంటూనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది అనే తరుణంలో ఊహించని విధంగా కాంతి కిడ్నాప్ చేయబడుతుంది. అందుకు కారణం గురు నారాయణ (పశుపతి).

అసలు కాంతిని కిడ్నాప్ చేయడానికి గురు నారాయణకు సహకరిచింది ఎవరు? కాంతిని కిడ్నాప్ చేయడం వెనుక అసలు రహస్యం ఏమిటి? వంటి విషయాలకు సమాధానం తెలియాలంటే “రాజా విక్రమార్క”ను థియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: కార్తికేయ నటుడిగా ప్రతి చిత్రంతోనూ ఎదుగుతూనే ఉన్నాడు. ఒకపక్క బడా హీరోల సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ.. మరోపక్క కథానాయకుడిగా విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తన కెరీర్ ను సరైన మార్గంలో తీర్చిదిద్దుకుంటున్నాడు. ఈ చిత్రంలోనూ కాస్త ధూల ఎక్కువైన ఏజెంట్ గా కార్తికేయ తన డైలాగ్ డెలివరీతో విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక యాక్షన్ & డ్యాన్స్ సీక్వెన్సుల్లో మనోడు ఎప్పటిలానే ఇరగదీశాడు. సరిగ్గా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన క్యారెక్టరైజేషన్ తో మోసేశాడు.

తాన్య రవిచంద్రన్ క్యూట్ గా ఉంది కానీ.. హావభావాల విషయంలో తేలిపోయింది. చాలా సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్ ఏమిటో సరిగా అర్ధమవ్వడానికి సమయం పట్టింది. సుధాకర్ కోమాకుల ఈ చిత్రంలో భిన్నమైన షేడ్స్ తో అలరించాడు. తమిళ నటుడు పశుపతి విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక తనికెళ్ళ భరణి ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రాసుకున్న కథ-కథనం సోసోగా ఉన్నా.. సదరు సన్నివేశాల కంపోజిషన్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి. యాక్షన్ బ్లాక్స్ ను బాగా డిజైన్ చేయించుకున్నాడు. అయితే.. సెకండాఫ్ లో మాత్రం తేలిపోయాడు. కథను ఎలా ముగించాలో తెలియక తెగ ఇబ్బందిపడ్డాడు. ముఖ్యంగా పశుపతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ లో పెట్టిన శ్రద్ధను, కథనంపై పెట్టలేదు.

అందువల్ల మంచి కంటెంట్ ఉన్న సినిమా సోసోగా మిగిలిపోయింది. డైలాగ్స్ లో ప్రాసలు లేకుండా సిచ్యువేషనల్ గా ఉండడం మరో ప్లస్ పాయింట్. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం సినిమాకి మంచి ప్లస్ ముఖ్యంగా నేపధ్య సంగీతం సన్నివేశాల్లోని ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేసింది. పి.సి.మౌళి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగుంది.

విశ్లేషణ: క్యారెక్టరైజేషన్స్ పరంగా ఉన్న చిన్నపాటి లోపాలు, ప్రీక్లైమాక్స్ ను సాగదీసిన విధానం పక్కన పెడితే “రాజా విక్రమార్క” కాస్త పర్వాలేదనే అనిపిస్తుంది. కార్తికేయ క్యారెక్టరైజేషన్ & కామెడీ కోసం మాత్రం ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. అయితే.. దర్శకుడు శ్రీ సారిపల్లి మాత్రం ఈ తరహా కథలను ఎంచుకున్నప్పుడు కాస్త లాజిక్స్ మీద కూడా శ్రద్ధ పెడితే దర్శకుడిగా మంచి భవిష్యత్, ప్రేక్షకులకు కాస్త ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. లేదంటే సగం సగం నీరసంతో సాగడమే.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus