Rajadhani Files Review in Telugu: రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వినోద్ కుమార్ (Hero)
  • పుష్పరాజ్ అఖిలన్ (Heroine)
  • వాణీ విశ్వనాధ్, వీణ పంచపర్వాల, పవన్ షణ్ముఖ్, విశాల్ తదితరులు.. (Cast)
  • భాను శంకర్ (Director)
  • కె.రవిశంకర్ (Producer)
  • మణిశర్మ (Music)
  • రామలింగం రమేష్ బాబు (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 15, 2024

ఆంధ్రలో ఎలక్షన్స్ దగ్గరవుతున్న కొద్దీ పోలిటికల్ టార్గెట్ సినిమాలు, పొలిటీషియన్ల బయోపిక్ లు వరుసబెట్టి విడుదలవుతున్నాయి. ఆ క్రమంలో విడుదలైన తాజా చిత్రం “రాజధాని ఫైల్స్”. తెలుగుఒన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి భాను శంకర్ దర్శకుడు. విడుదలైన ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉండడంతో ప్రతిపక్షం ఈ చిత్రాన్ని ఇండైరెక్ట్ గా భీభత్సంగా ప్రమోట్ చేసింది. దాంతో ఈ సినిమాను నిలిపేయాలని అధికార ప్రభుత్వం ప్రయత్నించడం, దర్శకనిర్మాతలు కోర్ట్ నుండి స్టే తెచ్చుకొని మరీ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. మరి సినిమా సంగతేంటో చూద్దాం..!!

కథ: అయిరావతి గ్రామ ప్రజలు రాజధాని కోసం తమ భూముల్ని, పొలాల్ని ధారాధత్తం చేయగా.. మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిరావతి రాజధాని కాదని తేల్చి చెప్పి రైతుల నోట మట్టి కొడుతుంది. దాంతో రైతులు ప్రభుత్వానికి ఎదురెళతారు. రైతులు, ప్రభుత్వం మధ్య జరిగిన ప్రచ్చన్న యుద్ధంలో చివరికి గెలుపు ఎవరిది? అనేది “రాజధాని ఫైల్స్” కథాంశం.

నటీనటుల పనితీరు: వాణీ విశ్వనాధ్ మినహా ఒక్కరూ తమ నటనతో ఆకట్టుకోలేకపోయారు. వినోద్, పుష్పరాజ్, వీణ, పవన్, షణ్ముఖ్ తదితరుల నటనలో అతి కనిపిస్తుందే కానీ.. ఎక్కడా ఎమోషన్ అనేది మచ్చుకకైనా పండలేదు.

సాంకేతికవర్గం పనితీరు: రైతుల కష్టాలు చూపించడమో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమో పక్కనెట్టి.. అధికార పార్టీలోని కొందరి ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం సృష్టించిన సన్నివేశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మణిశర్మ లాంటి సంగీత దిగ్గజం కూడా ఏమీ చేయలేక మిన్నకుండిపోయిన సినిమా ఇది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, డి.ఐ వంటి టెక్నికాలిటీస్ గురించి మాట్లాడకపోవడమే బెటర్.

దర్శకుడు ఒక సీరియస్ సినిమా తీస్తున్నానుకొని.. ఒక స్పూఫ్ తీశాడు. మంచి టైటిల్, ఆంధ్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాన్ని కేవలం అధికార పార్టీ మీద కోపంతో వేస్ట్ చేశాడు.

విశ్లేషణ: పోలిటికల్ కామెడీలు, సెటైర్లు సమాజానికి అవసరం. ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ద్వంధ్వ పోకడలను వేలెత్తి చూపడం సదరు పోలిటికల్ సినిమాల బాధ్యత. కానీ.. ఈమధ్య వచ్చిన, వస్తున్న సినిమాలు కేవలం ఒక వర్గం మీద దాడి చేయడానికి లేదా ఒక వర్గం మీద సింపతీ పెంచడానికి మాత్రమే తీస్తున్నట్లుగా ఉంది. “రాజధాని ఫైల్స్” కూడా ఆ వర్గానికి చెందిన సినిమానే. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతిపక్ష అభిమానులు మినహా మరెవర్నీ కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేని సినిమా (Rajadhani Files) ఇది.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus