మంచి పనికి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎల్లపుడూ ముందుంటారు. పోలీసులు చేపట్టిన పలు అవగాహన కార్యక్రమాల్లో తన వంతు సాయం చేశారు. ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని ఆనందంగా స్వీకరించారు. ఈ నెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ ‘హరితహారం’లో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కవిత.. తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటారు.
ఆ తర్వాత ఆమె రాజమౌళితో పాటు మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసిరారు. కవిత విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన రాజమౌళి.. తన ఫామ్ హౌస్‌లో మర్రి చెట్టు, గుల్మొహర్ చెట్టు, నిమ్మ చెట్టు లను ఈరోజు నాటారు. అనంతరం పుల్లెల గోపీచంద్, మంత్రి కేటీఆర్, యంగ్ డైరెక్టర్స్ సందీప్ వంగా, నాగ అశ్విన్‌లకు “హరితహారం” గ్రీన్ ఛాలెంజ్ విసురుతూ తాను మొక్క నాటుతున్న ఫొటోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పర్యావరణ పరిరక్షణలో సెలబ్రిటీలు భాగం కావడం మంచి పరిమాణం. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలు కూడా మొక్కలు నాటేందుకు ఉత్సాహం కనబరుస్తారని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.