BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

ఇండియన్ సినిమాను ప్రపంచ పటంలో నిలబెట్టిన కాంబినేషన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది రాజమౌళి ప్రభాస్. వీరిద్దరి బంధం కేవలం సినిమాలకే పరిమితం కాదు, అంతకు మించి అని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరిగింది. ‘బాహుబలి: ది ఎపిక్’ రిలీజ్ కోసం ప్రభాస్ జపాన్ వెళ్లారు. అక్కడ డార్లింగ్ కు దక్కుతున్న ఆదరణ చూసి, ఇక్కడ ఉన్న జక్కన్న ఒక ఎమోషనల్ లేఖను విడుదల చేశారు.

BAAHUBALI

రాజమౌళి రాసిన ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “నేను జపాన్ వెళ్లిన ప్రతిసారీ వాళ్లు నిన్ను అడిగేవారు. ఇన్నాళ్లకు వాళ్ల కోరిక తీరింది. జపాన్ ప్రజల ప్రేమ చూసి నీ కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. ఆ అనుభూతిని నువ్వు ఆస్వాదించు డార్లింగ్” అంటూ జక్కన్న రాసుకొచ్చారు. తన హీరో అక్కడ పొందుతున్న గౌరవం చూసి ఒక దర్శకుడిగా, స్నేహితుడిగా రాజమౌళి ఎంత సంతోషిస్తున్నారో ఈ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది.

వాస్తవానికి జపాన్ లో ‘బాహుబలి’కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడ ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్. ఇప్పుడు రెండు భాగాలను కలిపి, రీ ఎడిట్ చేసి ‘ది ఎపిక్’ వెర్షన్ గా రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ స్వయంగా అక్కడికి వెళ్లారు. పదేళ్లుగా ప్రభాస్ రాక కోసం ఎదురుచూస్తున్న జపనీస్ ఫ్యాన్స్, ఇప్పుడు ఆయన్ను చూడగానే ఎమోషనల్ అవుతున్నారు.

గతంలో సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల ప్రభాస్ ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. అప్పుడే “కచ్చితంగా వస్తాను” అని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు. అక్కడి లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ ను చుట్టుముట్టి, బహుమతులు ఇస్తూ చూపిస్తున్న అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఆ వీడియోలు చూసే రాజమౌళి ఇలా స్పందించారు. మొత్తానికి ఇన్నేళ్లయినా ‘బాహుబలి’ మేనియా తగ్గకపోవడం, ప్రభాస్ కు అక్కడ ఇంకా ఆదరణ పెరగడం విశేషం. జక్కన్న లేఖ, ప్రభాస్ జపాన్ టూర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus