క్రమశిక్షణ.. నిబద్దత.. ప్రణాళిక ఇవన్నీ కలిస్తే రాజమౌళి. ఖర్చు పెట్టిన ప్రతి పైసా వెండితెరపై కనిపించాలి.. కరిగిపోయే ప్రతి రూపాయి.. పది రూపాయలను తెచ్చి పెట్టాలి… అనే లక్ష్యంతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. తాను కంఫర్ట్ జోన్ లో ఉండడం కంటే… నిర్మాత సేఫ్ జోన్ లో ఉండాలని శ్రమించే శ్రామికుడు రాజమౌళి. అందుకే తెలుగు సినిమా వందకోట్లు వసూలు చేస్తే రికార్డుగా చెప్పుకునే సమయంలోనే వందకోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా నిర్మించాలని సంకల్పించారు. 400 కోట్లు ఖర్చు పెట్టించి 1800 కోట్లు రాబట్టిగలిగారు. దీని వెనుక జక్కన్న ప్రతిభ మాత్రమే కాదు ప్రణాళిక కూడా ఉందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
అదే ప్రణాళికను తాజా మల్టీస్టారర్ సినిమాకి పాటిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాని 300 కోట్లతో నిర్మించడానికి డీవీవీ దానయ్య సిద్ధంగా ఉన్నారు. అయితే దక్షిణాదిన బిజినెస్ చేయించే శక్తి దానయ్యకి ఉంది. ఉత్తరాదిన ఈ చిత్రం ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావాలంటే అనుభవం కలిగిన వ్యక్తి ఉండాలి. అందుకే బాహుబలిని హిందీ భాషలో పంపిణీ చేసిన కరణ్ జోహార్ ని #RRR ప్రాజక్ట్ లో భాగస్వాములుగా చేశారు. ఇక ఈ మూవీ కూడా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కావడం తధ్యమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారానికి ఎటువంటి ఢోకా ఉండదని భావిస్తున్నారు.