మోసగాళ్లపై అవగాహన కల్పిస్తున్న రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ

  • February 20, 2018 / 06:13 AM IST

స్మార్ట్ ఫోన్ల విప్లవంతో అనేక పనులు చాలా సులువుగా చేయగలుగుతున్నారు. మోసగాళ్లు కూడా మోసం చేయడం అంతే సులువు అవుతోంది. ఒక నెంబర్ తో.. లక్షలు సంపాదిస్తున్నారు. మహిళల్ని వేధిస్తున్నారు. భయపెడుతున్నారు. రోజురోజుకి ఈ మోసాలు ఎక్కువైపోతున్నాయి. మోసాలపై అవగాహనలేని యువతీ యువకులు ఈ వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. పోలీస్ కేసు పెట్టడానికి సైతం వెనకడుగు వేస్తున్నారు. అందుకే మోసాలపై చైతన్యం కలిగించేందుకు లఘు చిత్రాలను పోలీసులు నిర్మించారు. అందుకు రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవర కొండ చేతులు కలిపారు. ఈ వీడియోలతో సందేశం ఇచ్చారు. మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ లలో పరిచయమైన అమ్మాయి, అబ్బాయిలను నమ్మి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయవద్దని విజయ్ దేవర కొండ తనదైన స్టైల్లో చెప్పారు. అలాగే తారక్ అమ్మాయిలను హెచ్చరించారు.

సోషల్ మీడియాలో అమ్మాయిలు తమ వ్యక్తిగత వివరాలను, ఫోటోలను పెట్టి మృగాళ్ల చేతిలో చిక్కవద్దని సలహా ఇచ్చారు. ఇక విదేశాల్లో జాబ్ వచ్చిందని డబ్బులు పంపించండని చెప్పే మరో రకం మోసగాళ్లపై రూపొందించిన వీడియోకి రాజమౌళి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మీకు ఉద్యోగం ఇచ్చేవారికి మీ ట్యాలెంట్ కావాలి కానీ, మీ డబ్బులు కాదంటూ గట్టిగానే చెప్పారు. నిన్న రిలీజ్ అయిన ఈ వీడియోలకు అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన వస్తోంది. రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ లు ఈ వీడియోలో కనిపించడం వల్ల చాలా ఎక్కువమంది ఈ వీడియోని చూస్తున్నారని పోలీసులు ఆనందిస్తున్నారు. ఇక నుంచైనా సైబర్ క్రైమ్ రేట్ తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus