ఇప్పుడంటే పాన్ ఇండియా ఇమేజ్ గురించి, పాన్ ఇండియా సినిమాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ వాస్తవానికి తమిళ స్టార్లు అయినటువంటి రజినీకాంత్(Rajinikanth), కమల్ హాసన్..లు ఫస్ట్ పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పాలి. అయితే రజినీకాంత్ మొదటి హిందీ సినిమా చేసినప్పుడు అక్కడి బయ్యర్స్ ఆ సినిమాని కొనుగోలు చేయలేదట. స్వయంగా రజినీకాంత్ ఈ విషయాన్ని రివీల్ చేయడం గమనార్హం.
రజినీకాంత్ మాట్లాడుతూ.. “నన్ను సినీ పరిశ్రమకి పరిచయం చేసింది కె.బాలచందర్ గారు. తమిళంలో నాకు ఛాన్స్ ఇచ్చింది ఆయనే. అయితే హిందీ సినీ పరిశ్రమకి నన్ను పరిచయం చేసింది పూర్ణ చంద్రరావు గారు. ఒకసారి నా మేనేజర్ వచ్చి నాతో హిందీ సినిమా చేయడానికి నిర్మాత పూర్ణచంద్రరావు గారు వచ్చారు అని చెప్పారు. పూర్ణచంద్రరావు గారు, టి.రామారావు గారు వచ్చి ‘చట్టానికి కళ్ళులేవు’ అనే సినిమా హిందీలో చేయాలి అన్నారు.
ఆ సినిమాని తమిళంలో చేశారు. హిట్ అయ్యింది. తెలుగులో చిరంజీవితో చేశారు అది కూడా హిట్ అయ్యింది అని నా దగ్గరకు వచ్చి చెప్పారు. నాకు మరాఠీ తప్ప హిందీ రాదు. అందులో హేమ మానిలిని సిస్టర్ క్యారెక్టర్, రీనా రాయ్ హీరోయిన్..అన్నారు. ఇదేంటి అంత పెద్ద పెద్ద స్టార్స్ నాతో నటిస్తారా? అని డౌట్ వచ్చింది. తర్వాత అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ అన్నారు. దీంతో వీళ్ళు ఊరికే నా దగ్గరకి వచ్చి గ్యాస్ కొడుకున్నారు అనిపించింది.
దీంతో వాళ్ళని మందలించింది పంపించేశాను. అయితే దూరంగా ఉండి దర్శకులు రామారావు గారు, పూర్ణ చంద్రరావుగారి దగ్గర నన్ను తిడుతున్నారు. అది నాకు వినిపించింది.తర్వాత సరే అని ఓకే చెప్పాను. అలా ‘అందా కనూన్’ అనే సినిమాలో నటించాను. అయితే వీడు హీరో ఏంటి? అని భావించి ఆ సినిమాని చాలా మంది కొనుక్కోలేదు. దీంతో పూర్ణ చంద్రరావు గారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు.
సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆయనకు డబ్బు వచ్చింది. తర్వాత పూర్ణ చంద్రరావు గారు మరో 4,5 సినిమాలు నాతో చేశారు” అంటూ చెప్పుకొచ్చారు.