వెండితెరపై ఎంతో స్టైల్ గా నటించే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ .. నిజజీవితంలో చాలా నిరాడంబరంగా ఉంటారు. అందుకే ఆయన అంటే భాషాభేదం లేకుండా చాలామందికి ఇష్టం. రజనీ చేసిన తాజా చిత్రం 2.O ఆడియో రిలీజ్ వేడుక నిన్న దుబాయ్ లో వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకపై సినిమా గురించి మాట్లాడిన విషయాలు ఒక ఎత్తయితే.. జీవితం గురించి రజనీ చెప్పిన మాటలు మరో ఎత్తు. ఇప్పుడు ఎక్కడ చూసిన రజనీ వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతగా ప్రభావం చూపిన గోల్డెన్ వర్డ్స్ ఏమిటంటే.. “కెరీర్ మొదట్లో ఎవరికైనా సరే డబ్బు, పేరు, కీర్తి అనే మూడు విషయాల గురించి చాలా ఆలోచిస్తారు.అంతే కాకుండా అవే సంతోషమని అందరూ అనుకుంటారు. కానీ జీవితంలో ఒక దశ దాటిన తర్వాత అవి ఏ మాత్రం ఆనందాన్ని ఇవ్వవు.
మొదట వాటి గురించి ఆలోచించిన విధానం గురించి ఇప్పుడు ఆలోచిస్తే నాకు చాలా నవ్వొస్తోంది.” అని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ ” ప్రేక్షకుల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల ఇంతవరకు వచ్చాను. చిత్ర పరిశ్రమలో నా జీవితం తొందరగా గడిచిపోయింది అన్నట్లు అనిపిస్తోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాలుగైదేళ్లయినట్టే ఉంది” అని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ చేయడానికి సినిమాలో పంచ్ డైలాగులే కాదు.. నిజ జీవితంలో సక్రమంగా యువతని నడిపించడానికి రజనీ ఇలాంటి మాటలు చెప్పడం అభినందనీయం.