ఒకప్పుడు తెలుగు సినిమా ప్రచారం అంటే ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదే గుర్తొచ్చేది. ఎంత పెద్ద సినిమా అయినా, ఆ సినిమాకు, ఆ హీరోకు తెలుగు రాష్ట్రం మొత్తం ఫ్యాన్స్ ఉన్నా.. భాగ్యనగరంలోనే ఈవెంట్లు చేసేవారు. దాని కోసం ఎక్కడెక్కడి నుండో జనాలు వచ్చేవారు కూడా. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. వరంగల్, కర్నూలు, విశాఖపట్నం అంటూ వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే ఇది తక్కువే.
ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే.. తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఇప్పుడు హైదరబాద్‌లో పర్మిషన్లు రావడం లేదు. వివిధ కారణాల రీత్యా పోలీసు శాఖ ఈవెంట్ల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి అని కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు అనుకోండి. ఈ నేపథ్యంలో రాబోయే రెండు పెద్ద సినిమాలు ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) , ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఈవెంట్లు ఎక్కడ అనే చర్చ మొదలైంది.
డిసెంబరు 5న ‘పుష్ప 2’ సినిమా రానున్న నేపథ్యంలో ఒకవేళ టీమ్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం బాగా చేయాలి అనుకుంటే ఈ నెలాఖరులోనే ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాలి. ఈ నేపథ్యంలో ఈవెంట్ హైదరాబాద్‌లో చేస్తారా అంటే ఎల్బీ స్టేడియం కానీ, రామోజీ ఫిలిం సిటీలో కానీ చేయాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోవాల్సిందే అని అనుకుంటున్నారట. అదే జరిగితే సినిమా నేపథ్యానికి తగ్గట్టు తిరుపతిలో చేయాలి అని అనుకుంటున్నారట.
ఇక ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాక కోసం ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని ఫిక్స్ అయ్యారట. పవన్ ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు ఈవెంట్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అది కూడా అమరావతి పరిసరాల్లోనే అంటున్నారు. లేదంటే పిఠాపురంలో ఈవెంట్ నిర్వహించే ఉద్దేశంలో కూడా ఉన్నారు అని తెలుస్తోంది. మరి సినిమా టీమ్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.