Zebra Review in Telugu: జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 22, 2024 / 10:57 AM IST

Cast & Crew

  • సత్యదేవ్ (Hero)
  • ప్రియ భవాని శంకర్ (Heroine)
  • డాలీ ధనంజయ,జెన్నిఫర్‌ పిక్కినాటో, సునీల్‌, సత్యరాజ్, సత్య (Cast)
  • ఈశ్వర్ కార్తీక్ (Director)
  • బాల సుందరం , ఎస్‌.ఎన్‌. రెడ్డి ,ఎస్‌ పద్మజ , దినేష్‌ సుందరం (Producer)
  • రవి బస్రూర్ (Music)
  • సత్య పొన్మార్‌ (Cinematography)
  • Release Date : నవంబర్ 22, 2024

సత్యదేవ్ (Satya Dev) , డాలి ధనంజయ్ ప్రధాన పాత్రల్లో “పెంగ్విన్” ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ (Eashvar Karthic)  దర్శకత్వంలో తెరకెక్కిన వైట్ కాలర్ క్రైమ్ డ్రామా “జీబ్రా”(Zebra). సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా చిరంజీవి (Chiranjeevi)   రావడం, ఆయన సత్యదేవ్ మీద ప్రశంసల వర్షం కురిపించడంతో సినిమాకి మంచి రీచ్ వచ్చింది. అలాగే.. సత్యదేవ్ కూడా సినిమాను భీభత్సంగా ప్రమోట్ చేశాడు. మరి సినిమా రిజల్ట్ ఏమైంది? సత్యదేవ్ కి హీరోగా హిట్ పడిందా? అనేది తెలుసుకుందాం..!!

Zebra Review in Telugu

కథ: బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్ షిప్ మ్యానేజర్ గా వర్క్ చేసే సూర్య (సత్యదేవ్) తన తెలివైన తల్లి, తనను ప్రాణంగా ఇష్టపడే అమ్మాయితో స్వాతి (ప్రియ భవానీ శంకర్), తప్పించుకోలేని స్నేహితుడు బాబ్ (సత్య)తో సావాసం చేస్తూ లైఫ్ ను నెట్టుకొచ్చేస్తుంటాడు. అయితే.. స్వాతిని ఓ నాలుగు లక్షల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ ఇష్యూ నుండి బయటపడేసే క్రమంలో తాను 5 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ లో ఇరుక్కుంటాడు.

కట్ చేస్తే.. స్టేట్ లోనే ఒన్నాఫ్ ది డేంజరస్ పర్సన్ ఆది (ధనంజయ్)కి ఢీకొట్టాల్సిన పరిస్థితి వస్తుంది సూర్యకు. అసలు 5 కోట్ల రూపాయల సమస్యలో సూర్య ఎలా ఇరుక్కున్నాడు? సూర్య లైఫ్ లోకి ఆది ఎందుకు వచ్చాడు? ఈ సమస్యల నుంచి సూర్య ఎలా బయటపడ్డాడు? అనేది “జీబ్రా” కథాంశం.

నటీనటుల పనితీరు: లెక్కల పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి సెంటర్ కి వెళ్తే సైన్స్ పేపర్ ఇచ్చినట్లు. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తాడు అని ప్రిపేర్ అయ్యి థియేటర్ కి వెళ్తే, డాలీ ధనంజయ్ అవుటాఫ్ సిలబస్ లా ప్రత్యక్షమై దుమ్ము లేపాడు. డాలీ మంచి నటుడు అనే విషయం తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేదు. “పుష్ప”లో సైడ్ విలన్ గా మాత్రమే చూపించగా, ఈ సినిమాలో హీరో కంటే పవర్ ఫుల్ రోల్లో చూపించారు. ఒక్కోసారి సినిమాలో హీరో డాలీ ఏమో అనిపిస్తుంటుంది. అతడి ఎలివేషన్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ వేరే లెవల్లో ఉన్నాయి. కచ్చితంగా డాలీకి ఈ సినిమా తెలుగు మార్కెట్ పెంచుతుంది. మాస్ ఆడియన్స్ సినిమాలో అందరికంటే ఎక్కువగా డాలీ క్యారెక్టర్ కు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు.

సత్యదేవ్ ఏమాత్రం తగ్గకుండా పెర్ఫార్మ్ చేశాడు. సూర్య పాత్రకి చాలా షార్ప్ ఎమోషన్స్ ప్రదర్శించడం అవసరం. సత్యదేవ్ అందులో సిద్ధహస్తుడు కావడంతో చాలా సునాయాసంగా ఆ పాత్రలో జీవించేశాడు. సత్య తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి హైలైట్ అవ్వడమే కాక సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాడు. సత్యరాజ్ టైమింగ్ తో అలరించగా, సునీల్ కాస్త డిఫరెంట్ రోల్లో ఆకట్టుకున్నాడు. ప్రియ భవానీ శంకర్, జెన్నిఫర్ గ్లామర్ యాడ్ చేశారు. మిగతా నటీనటులందరూ ఫర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: రవి బస్రూర్ సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సన్నివేశాన్ని చక్కగా ఎలివేట్ చేయడంలో రవి నేపధ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. సత్య పోన్మార్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. సినిమాలో విభిన్నమైన కథలు కనిపిస్తుంటాయి. వాటిని చక్కగా పేర్చడంలో ఎడిటర్ సఫలమయ్యాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఒక బ్యాంక్ ను చాలా పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారు. ఎక్కడా కూడా వెలితి కనిపించలేదు.

ఇక దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తన మొదటి సినిమా “పెంగ్విన్”కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను జాగ్రత్తగా పరిశీలించి “జీబ్రా” విషయంలో చాలా జాగ్రత్తపడ్డాడు అని అర్ధమవుతుంది. స్క్రీన్ ప్లేను ఎంతో నేర్పుతో నడిపిన విధానం బాగుంది. ముఖ్యంగా సీన్ కపోజిషన్స్ విషయంలో తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాలి. డాలీ & సత్యదేవ్ ఫస్ట్ మీట్ ను కంపోజ్ చేసిన విధానం మంచి మాస్ కిక్ ఇస్తుంది. దర్శకుడు ఈశ్వర్ ఇదివరకు బ్యాంక్ ఎంప్లాయీ కావడంతో బ్యాంకింగ్ రిలేటెడ్ కంటెంట్ ను ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బాగుంది.

అయితే.. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి చాలా క్లారిటీగా చెప్పాల్సిన విషయాలను పైపైన చెప్పుకుంటూ వెళ్ళడం, చాలా విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా ఎమోషన్ తో కవర్ చేయాలి అనుకోవడం, ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయి చేత నాలుగు రోజుల్లో 5 కోట్లు సంపాదించేలా చేసి ఆది పాత్ర తన పవర్ ను ప్రూవ్ చేసుకోవడం వంటివి కన్విన్సింగ్ గా లేవు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అయ్యేది. అవన్నీ లోపించడంతో యావరేజ్ గా మిగిలిపోయింది.

విశ్లేషణ: ఈ తరహా సైబర్ క్రైమ్ కథల్లో డీటెయిలింగ్, ఎమోషన్ తోపాటు ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్ గా ఇవ్వాలి. ఈ మూడు విషయాల్లో ఏ ఒక్కటి మిస్సైనా సంపూర్ణత కొరవడుతుంది. “జీబ్రా” విషయంలో అదే జరిగింది. హీరో సమస్యల నుంచి ఎలా బయటపడుతున్నాడు? ముఖ్యంగా 100 కోట్ల రూపాయల సమస్య నుంచి కేవలం ఒక ఈమెయిల్ తో ఎలా తప్పించుకున్నాడు? వంటి ప్రశ్నలకు లాజికల్ ఆన్సర్స్ లేవు. అలాగే.. స్టాక్ మార్కెట్ టాపిక్ ను డీల్ చేసిన విధానం కూడా ఆకట్టుకొనే స్థాయిలో లేదు.

అందువల్ల.. కథలో ఒక పెయిన్ అనేది లేకుండా సాగిపోయింది. ఆ కారణంగా ఆడియన్స్ కథతో కానీ ట్రావెల్ చేయలేరు, హీరో సమస్యను ఓన్ చేసుకొని అతడు గెలవాలి అని తపించలేరు. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అయితే.. ఈ లాజిక్కులు ఏమీ పట్టించుకొని ప్రేక్షకుల్ని మాత్రం “జీబ్రా” అలరిస్తుంది. ముఖ్యంగా డాలీ యాక్టింగ్ & క్యారెక్టరైజేషన్, సత్య కామెడీ, సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ వంటివి ఈ సినిమాని ఒన్ టైమ్ వాచ్ గా నిలిపాయి.

ఫోకస్ పాయింట్: సత్యదేవ్ లాజిక్స్ ని డాలీ ధనుంజయ్ మ్యాజిక్ డామినేట్ చేసింది.

రేటింగ్: 2.5/5

Click Here to Read In ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus