ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై ప్రముఖ కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెరిసిన విషయం తెలిసిందే. ఆ మ్యాగజైన్‌లో ఆయ కొన్ని ఆసక్తికర విశేషాలు షేర్ చేసుకున్నారు. తన మీద తండ్రి చిరంజీవి ప్రభావం, కుమార్తె క్లీంకార గురించి, తన కొత్త సినిమా ‘పెద్ది’ గురించి కూడా చెప్పారు. తండ్రి చిరంజీవి సూచనతో 17 ఏళ్ల వయసులోనే అయ్యప్ప దీక్ష తీసుకోవడం ప్రారంభించానని చరణ్ చెప్పారు. అది తన జీవితంలో క్రమశిక్షణను పెంచిందన్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు తనపై బాధ్యతను మరింత పెంచిందన్న చరణ్.. మనం సినిమాను మాత్రమే కాదు.. సంస్కృతిని కూడా ప్రపంచానికి చెబుతున్నామన్నారు. అందుకే ప్రతి షాట్‌లోనూ నిజాయతిగా నటించాల్సి ఉంటుందని తన ఆలోచనా విధానం గురించి చెప్పాడు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పాడు. ఏడాదిన్నర నుండి ఈ సినిమా కోసం కఠోర శిక్షణ తీసుకుంటున్నామన్నాడు. బాలీవుడ్ సినిమాలు ‘సుల్తాన్’, ‘దంగల్’కు పనిచేసిన కోచ్ దగ్గర కుస్తీ నేర్చుకున్నట్లు చెప్పాడు.
అందరూ 50 గంటలు కష్టపడితే, నువ్వు 100 గంటలు కష్టపడు అని నాన్న చెప్పారు. ఆయన నేర్పిన సూత్రంతోనే ఇప్పుడు కెరీర్‌ను నిర్మించుకుంటున్నానని చెప్పాడు. క్లీంకార గురించి చెబుతూ.. తనను ఉపాసన అపురూపంగా చూసుకుంటుంది. ఆమె ఎప్పుడైనా తిట్టినప్పుడు క్లీంకారా తన దగ్గరకు వస్తుందని రామ్‌చరణ్ చెప్పి నవ్వేశారు.
ఇక చరణ్ సినిమాల సంగతి చూస్తే.. ‘పెద్ది’ సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా వాయిదా వేశారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒకట్రెండు రోజుల్లో కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేస్తారని సమాచారం. జూన్ నెలలో కానీ, మే ఆఖరున కానీ ఉండొచ్చు అని ఓ టాక్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక.