నేను డిజిటల్ ప్రపంచంలోకి రావడానికి ఒకే ఒక్క కారణం..వెండితెర మీద నన్ను నా ఇష్టం వచ్చినట్టు చెప్పనివ్వని కథల్ని ఎవడినీ కేర్ చెయ్యకుండా నాకిష్టం వచ్చినట్టు చెప్పడం కోసం. ఈ బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం వరల్డ్ ప్రేక్షకుల కోసం ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్లో నేను నిర్మిస్తున్న గన్స్ అండ్ థైస్ సిరీస్ తర్వాత నేను తీస్తున్న మొట్టమొదటి తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ “కడప”.
హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఇగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఒక ప్రాంతం స్ఫూర్తిగా ఈ టైటిల్ పుట్టింది. రక్తచరిత్ర తీస్తున్నప్పటి నుంచి చాలా మంది మాజీ ఫ్యాక్షనిస్టులు, వాళ్ళ బాధితులు, వాళ్ల బంధువులు, వాళ్లింట్లో పని చేసే వాళ్ల నుంచి,మరియు ఎందరి నుంచో నేను డబ్బులిచ్చి,బెదిరించి,మాటలతో మభ్యపెట్టి వాళ్లు గుండెల్లో దాచుకున్న రహస్యాలని బయటికి లాగేసిన మెటీరియల్ నుంచి పుట్టిందే ఈ “కడప” నిజం కథ.
నేను ఈ సబ్జెక్ట్ ని గతంలో రక్తచరిత్రలో డీల్ చేశాను కదా అని కొందరు ఇడియట్లు భావించవచ్చు. కానీ అది కేవలం 5% మాత్రమే నిజం. దానికి కారణం రక్తచరిత్రలో అసలు నిజాలని చాలా పైపైన చూపించాను. లోలోపలి పూర్తి నిజాలు అప్పటికి నాకు తెలియకపోవడం, కొన్ని వార్ణింగులు ఇచ్చి పుచ్చుకోవడం లాంటి ఇతరితరా కారణాల వల్ల అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపించలేకపోయాను.
దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో భయాన్ని నూతిలోకి పారేసి, ఎవడేమి అనుకున్నా, ఎవ్వడేమి ఫీల్ అయినా కేర్ చెయ్యకుండా నిజం కథని నిజంగా చూపించడానికి సైకిల్ చెయిన్ మీద ఒట్టుగా కంకణం కట్టుకున్నాను.
ఈ “కడప” వెబ్ సిరీస్ ట్రైలర్ రేపు..అంటే 15 డిసెంబర్ ఉదయం 10 గంటలకి రిలీజ్ అవ్వబోతోంది. – రామ్ గోపాల్ వర్మ