దాదాపు దశాబ్ధపు కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం పరితపిస్తున్న గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం “రామబాణం”. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వరుస విజయాలతో విజయ దుందుభి మ్రోగిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మరి ఈ “రామబాణం”తోనైనా గోపీచంద్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!
కథ: చిన్నప్పుడే అన్నయ్య (జగపతిబాబు)తో తలెత్తిన విబేధాల కారణంగా కలకత్తా వెళ్ళిపోయి.. అక్కడ పెద్ద డాన్ అవుతాడు విక్కీ (గోపీచంద్). తాను ప్రేమించిన భైరవి (డింపుల్ హయాతి) తండ్రిని కన్విన్స్ చేయడం కోసం స్వంత ఊరికి వచ్చినప్పుడు తన అన్నయ్య రాజారామ్ కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని.. తన డబ్బు, పరపతి ఉపయోగించి సదరు సమస్యలను సమాధానపరుస్తాడు.
ఈ క్రమంలో జికె (తరుణ్ అరోరా)తో తలపడాల్సి వస్తుంది. అసలు రాజారామ్ & జికెకి ఉన్న గొడవలు ఏమిటి? వాటిని విక్కీ ఎలా సాల్వ్ చేశాడు? అనేది “రామబాణం” కథాంశం.
నటీనటుల పనితీరు: గోపీచంద్ కు ఈ తరహా పాత్రలు నల్లేరు మీద నడక లాంటిది. సో, చాలా ఈజ్ తో విక్కీ పాత్రలో జీవించేశాడు గోపీచంద్. సెంటిమెంటల్ & ఎమోషనల్ సీన్స్ లో తన సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నాడు. యాక్షన్ బ్లాక్స్ లో ఎప్పట్లానే ఇరగదీశాడు.
జగపతిబాబు తన రెగ్యులర్ రోల్లో ఆకట్టుకున్నాడు. డింపుల్ గ్లామర్ యాడ్ చేయడానికి ప్రయత్నించింది. డ్యాన్స్ విషయంలో మాత్రం ఆడియన్స్ ను అలరించింది. తరుణ్ అరోరా, ఖుష్బూ, సచిన్ కేడ్కర్, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: కొత్తదనం కొరవడడమే ఈ చిత్రానికి పెద్ద మైనస్. కథ-స్క్రీన్ ప్లే మొదలుకొని సీన్ కంపోజిషన్ వరకూ ప్రతీదీ గత పదేళ్లుగా సౌత్ లో వచ్చిన వందల సినిమాలను గుర్తు చేస్తుంది. టెక్నికల్ గా సినిమా ఎంత బాగున్నా.. కథ-కథనంలో కనీస స్థాయి ఆకట్టుకొనే అంశాలు లేకపోవడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు బేజారైపోతాడు.
దర్శకుడిగా శ్రీవాస్ బేస్ మార్కులు కూడా సంపాదించుకోలేకపోయాడు. పళనిస్వామి సినిమాటోగ్రఫీ & మిక్కీ జె.మేయర్ సంగీతం మాత్రం సినిమాకి కాస్త కొత్తదనాన్నిచ్చాయి. మిగతా టెక్నికల్ అంశాల గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదు.
విశ్లేషణ: రొటీన్ సినిమా అని ట్రైలర్ చూసిన ఆడియన్స్ కి ఎలాగూ తెలిసిపోయింది కాబట్టి, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్తే మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకునే చిత్రం “రామబాణం”. అయితే.. మంచి కమర్షియల్ హిట్ అందుకోవాలన్న గోపీచంద్ కోరిక మాత్రం (Ramabanam) ఈ సినిమా నెరవేర్చడం కాస్త కష్టమే!
రేటింగ్: 2/5