ఒక భాషలో హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లోకి వెళుతున్నట్టే ఒక పరిశ్రమలో రాణించిన హీరోయిన్లు ఇతర పరిశ్రమల్లోను సందడి చేస్తుంటారు. ఓ రకంగా ఇది వారి ఎదుగుదలకు సూచనగా చెప్పుకోవచ్చు. ఇప్పడున్న అందాల భామలల్లో అనుష్క, నయనతార, కాజల్, తమన్నా వంటి వారు ఒకటికి మించిన భాషల్లో తమ ప్రతిభ చాటుతుండగా తాజాగా రాశి ఖన్నా తన వాసిని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.
తెలుగులో సినిమాలు చేస్తానంటూనే తమిళ సినిమాలకు సరెండర్ అయిపోయిన సిద్దార్థ్ హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ఎంపికైందట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సుబ్బరాయన్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దార్థ్ సినిమా అంటే ఎటూ తెలుగులు తెరపైకి వస్తుందని మరో ఆలోచనే లేకుండా ఈ సినిమాకి సైన్ చేసేసిందట ఈ అందాల భామ. ఇక తెలుగులో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రాశి ‘హైపర్’, ‘ఆక్సిజన్’ సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.