మాస్ మహారాజా రవితేజ కెరీర్ ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉంది. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’.. ఇలా వరుస ఫ్లాపుల తర్వాత, ‘మాస్ జాతర’ రూపంలో ఆయనకు కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్ తగిలింది. ఫ్లాప్ అవ్వడం కాదు, కనీస ఓపెనింగ్స్ కూడా రాకపోవడంతో ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యాయి.
ఈ దారుణమైన ఫ్లాపుల నుంచి బయటపడటానికి రవితేజ ఇప్పుడు తన పంథా మార్చారు. తన ఆశలన్నీ సంక్రాంతి 2026కి రాబోతున్న ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపైనే పెట్టుకున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. మాస్ జాతర సినిమా సంక్రాంతికి రావాల్సి ఉన్నా, చివరి నిమిషంలో వాయిదా పడి, ఫ్లాప్ అయ్యింది. అందుకే, ఈసారి సంక్రాంతిని మిస్ చేయకూడదని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారట.
సంక్రాంతి బరిలో నిలవడం కోసం, రవితేజ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం ఆయన ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదట. ఇది రవితేజ కెరీర్‌లోనే చాలా అరుదైన విషయం.
రవితేజ పారితోషికం ఒకప్పుడు రూ.25 కోట్ల వరకు ఉండేది. వరుస ఫ్లాపులతో ‘మాస్ జాతర’కు రూ.15 కోట్లకు తగ్గించుకున్నారని టాక్. ఇప్పుడు ఆ 15 కోట్లు కూడా పక్కన పెట్టి, ‘జీరో’ రెమ్యునరేషన్‌తో పనిచేస్తున్నారట.
సినిమాను ఎలాగైనా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో, నిర్మాతలకు భారం కాకూడదనే ఉద్దేశంతో, రవితేజ ఈసారి ‘ప్రాఫిట్ షేరింగ్’ మోడల్‌లోకి వెళ్లారు. సినిమా బిజినెస్ అంతా పూర్తయ్యాక, లాభాల్లో వాటా తీసుకోవాలన్నది ఆయన ప్లాన్. సంక్రాంతికి సినిమా యావరేజ్‌గా ఆడినా లాభాలు గట్టిగానే వస్తాయి. అప్పుడు ఆయన పారితోషికం కంటే ఎక్కువే రావొచ్చు. కానీ, ఇది రవితేజ తీసుకున్న అతిపెద్ద రిస్క్ అని ట్రేడ్ అంటోంది.