ఒక పాత్రతోనే తెరకెక్కిన సినిమాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. అయినప్పటికీ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాల పట్ల ఆసక్తి అలానే ఉంటుంది. అయితే అగ్ర హీరోలు ఇలాంటి సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. మలయాళ స్టార్ మమ్ముట్టి లాంటివాళ్లు తప్ప. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఓ సినిమా ఒకే పాత్రతో ఒకే షెడ్యూల్‌లో అది కూడా కట్స్ లేకుండా తెరకెక్కించారు. ఈ క్రమంలో ఆ సినిమా రికార్డులు కూడా నెలకొల్పింది. దీని గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
ఇండియా, అమెరికా సినిమా నిర్మాణ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘ఆగాశత్తిన్ ఉత్తరవు’. ఈ సినిమా గురించే ఇప్పుడ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో ఒకే కథా పాత్ర ఉంటుంది. అలాగే ఇటీవల ఒకే షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. కంటిన్యూస్‌గా 76 నిమిషాలపాటు సీన్స్‌ని షూట్ చేశారట. ఇందులో ఎలాంటి పరోక్ష కట్‌లు లేవని టీమ్ చెబుతోంది. అలాగే సింక్ సౌండ్‌తో సినిమాను రూపొందించారట. అంటే షూట్ అవుతున్నప్పుడు మాట్లాడిన మాటలే ఉంటాయి. మళ్లీ డబ్బింగ్ ఉండదు.
ప్రపచంలో ఇలా తెరకెక్కిన తొలి సినిమా ఇదని ‘ఆకాశత్తిన ఉత్తరవు’ సినిమా టీమ్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు కార్తిక్ రామకృష్ణన్ దర్శకత్వం వహించారు. మహేశ్వర పాండియన్ నిర్మిస్తూ, సహాయ దర్శకుడిగానూ వ్యవహరించారు. ఈ క్రమంలో తమ చిత్రం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించిందని కూడా టీమ్ చెప్పింది. ఇమయం రాసిన ప్రముఖ కథానిక ‘ఆకాశత్తిన్ ఉత్తరవు’ ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు టీమ్ వెల్లడించింది.