టాలీవుడ్ నుండి లేదంటే సౌత్ సినిమా నుండి బాలీవుడ్ వెళ్లి హిట్ కొట్టిన హీరోయిన్లు చాలా తక్కువ మంది. అలాంటి విజయం సాధించినా అక్కడి కెరీర్ కొనసాగించిన హీరోయిన్లు ఇంకా చాలా తక్కువ మంది. వీరొక రకం. ఇంకో రకం హీరోయిన్లు ఉన్నారు. బాలీవుడ్ సినిమా అవకాశం అందుకుని.. ఆ సినిమా ముందుకెళ్లక చాలా రోజులు ఆగిపోయి.. తర్వాత ఎప్పుడో సినిమా చేస్తారు. అయితే ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడరు. ఇలాంటి హీరోయినే రెజీనా కసాండ్రా. తెలుగులో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ప్రభ తగ్గిన హీరోయిన్ ఆమె.
ఓ పెద్ద సినిమా.. దాని అనౌన్స్‌మెంట్ ఇంకా పెద్దగా జరిగింది. ఆ ప్రారంభం సమయంలో దుస్తుల విషయంలో ఇబ్బంది ఎదుర్కొని అప్పట్లో బాగా ట్రోల్ అయింది. ఆ తర్వాత చాలా రోజులకు ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వచ్చిన ఆరేళ్లకు ‘జాట్’ సినిమాతో అక్కడ రీఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ‘కేసరి చాప్టర్ 2’ సినిమా కూడా చేసింది. వీటిలో ‘జాట్’ సినిమా ఒక్కటే సరైన విజయం అందుకుంది. మిగిలిన రెండు ఇబ్బందికర ఫలితాలే అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో తన అనుభవం ఏమంత బాగా లేదని చెప్పింది. దక్షిణాది కథానాయికగా తనను బాలీవుడ్ జనాలు భిన్నంగా చూశారని చెప్పింది. తనతో అక్కడి వాళ్ల ప్రవర్తనే సరిగా ఉండేది కాదని, వారి మాటల్లో స్పష్టమైన తేడా కనిపించేది అని కూడా చెప్పింది. దీంతో అక్కడ సఫకేషన్‌గా అనిపించింది అని కూడా చెప్పింది. అందుకే బాలీవుడ్‌లో పని చేసే విషయంలో ఒక రకమైన భయం కలిగిందని చెప్పింది.
అయితే అందరూ తనలా బాలీవుడ్‌లో ఇబ్బంది పడతారు అనుకోవడం లేదని, తన అనుభవం మాత్రం అలా ఉందని చెప్పింది. అయితే ఇక్కడే ఓ విషయం ఉంది. బాలీవుడ్ ఎక్స్‌పీరియన్స్ బాలేదు అంటూనే రెజీనా ఇప్పటికీ అక్కడ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ది వైవ్స్’, ‘సెక్షన్ 108’ అని రెండు బాలీవుడ్ సినిమాలు ఉండటం గమనార్హం.