రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా ప్రస్థానంలో తన మార్క్ డైరెక్షన్‌తో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న వర్మ (RGV), ఇటీవల కాలంలో వివాదాల వల్ల ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలుగు సినిమా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
రూ.1000 కోట్లు అంటూ నిర్మాణ బడ్జెట్‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్మ చేసిన ఈ ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత ‘వ్యూహం’ (Vyooham) అనే సినిమాతో వచ్చిన వర్మ, ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ కథనంతో ముందుకు రావడం, ఆ ప్రాజెక్ట్ వెనుక కథను అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే వర్మ గతంలో చాలాసార్లు ప్రకటించిన సినిమాలలో చాలా వరకు సెట్స్ పైకి రాకముందే క్యాన్సిల్ అయ్యాయి.
ఆమధ్య నాగార్జున (Nagarjuna) ఆఫీసర్ (Officer) తో బౌన్స్ బ్యాక్ అవుతారని అనిపించింది కానీ అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. మరి ఈసారైనా క్లిక్కయ్యే కాన్సెప్ట్ తో వస్తారో లేదో చూడాలి. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ తన మార్క్ సినిమాలు, సంచలన వ్యాఖ్యలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా వర్మ సినిమాలు తగిన స్పందన పొందకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రకటించడం వల్ల ఆయన పునరాగమనానికి ఇది ఒక గొప్ప అవకాశం కావొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వర్మ తాజా ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కథనం ఎటువంటి నేపథ్యంలో సాగుతుంది? ఎవరు నటీనటులు? వంటి ప్రశ్నలపై క్లారిటీ రావాల్సి ఉంది.