తెలుగులోకి సాయిపల్లవి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అథిరన్‌’

  • July 1, 2019 / 03:40 PM IST

మన ప్రేక్షకులకు సాయి పల్లవి తెలుగమ్మాయే. ‘ఫిదా’తో అంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందామె. తొలి చిత్రానికి తెలుగు నేర్చుకోవడమే కాదు… తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. తెలుగులో గలగలా మాట్లాడుతోంది. సాయి పల్లవి చేసిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ… ఆమెకున్న అభిమానులు ఎక్కువే. వాళ్ల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం సూపర్‌హిట్‌ మలయాళ చిత్రం ‘అథిరన్‌’ను ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ తెలుగులోకి తీసుకొస్తున్నారు.

సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌హిట్‌ మలయాళ సినిమా ‘అథిరన్‌’. వివేక్‌ దర్శకత్వం వహించారు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌ తెలుగులో అనువదిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్‌, అలాగే అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం. త్వరలో తెలుగు టైటిల్‌ ప్రకటిస్తాం’’ అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus