డైనోసార్ అంటూ… ఒకే ఒక్క పదంతో ప్రభాస్ అభిమానుల మనసుల్ని గెలుచుకున్న ప్రశాంత్ నీల్… ఇప్పుడు వారి కోపాన్ని చూస్తున్నారు. కారణం ఇంకా సినిమాకు నాలుగు వారాలే ఉంది.. త్వరలో డైనోసార్ ప్రతాపం చూస్తారు అంటూ నిన్న మొన్నటివరకు గొప్పగా చెప్పుకున్న ప్రభాస్ ఫ్యాన్స్… ఇప్పుడు సినిమా డేట్ తెలియక బాధ పడుతున్నారు. అయితే దీనికి బాలీవుడ్ నుండి సమాచారం వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నవంబరులో సినిమా వస్తుంది అనేది సమాచారం.
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సలార్’. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేస్తారని చెప్పారు. అయితే సినిమా విడుదలకు నెల రోజులే ఉన్నా ఇంకా ప్రచారం చేయకపోయేసరికి ఏదో సందేహం కలిగింది. సినిమాను ఏమైనా వాయిదా వేస్తున్నారా అనే డౌటానుమానం వచ్చింది. అనుకున్నట్లే సినిమాను వాయిదా వేస్తున్నారని చెప్పకనే చెప్పేశారు. సినిమా టీమ్ నుండి అధికారిక సమాచారం లేదు కానీ.. బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అయితే ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
తరణ్ ఆదర్శ్ ట్వీట్ ప్రకారం చూస్తే.. ఈ సినిమాను 11వ నెలలో తీసుకొస్తారు అంటున్నారు. డేట్ అయితే పక్కాగా చెప్పలేదు కానీ రెండో వారంలో ఈ సినిమా ఉండొచ్చు అని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. అలాంటప్పుడు బాలీవుడ్లో ఆ టైమ్‌కి పెద్ద సినిమాలు లేకుండా చూసుకోవాలి. అలా అయితే రెండో వారంలో సల్మాన్ కాన్ ‘టైగర్ 3’ ఉంది. కాబట్టి ఆ వారంలో ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలో నవంబరులో అని చెబుతున్నారు తప్ప డేట్ పక్కగా చెప్పలేకపోతున్నారట. ఈ విషయంలో చర్చలు పూర్తి చేసి ఒకట్రెండు రోజుల్లో సినిమా కొత్త డేట్‌ను అనౌన్స్ చేస్తారని టాక్. దీంతోపాటు స్పెషల్ పోస్టర్‌ను కూడా లాంచ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.