మురళీశర్మ, సచిన్ కేడ్కర్, వెన్నెల కిషోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు.. (Cast)
శివ నిర్వాణ (Director)
నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్ (Producer)
హేషమ్ అబ్ధుల్ వహాబ్ (Music)
మురళి.జి (Cinematography)
Release Date : సెప్టెంబర్ 01, 2023
“లైగర్” లాంటి అట్టర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండకు, “టక్ జగదీష్” లాంటి ఒటీటీ ఫ్లాప్ తర్వాత శివ నిర్వాణకు, సరైన కమర్షియల్ హిట్ అందుకోలేక ఇబ్బందిపడుతున్న సమంతకు ఎంతో కీలకమైన సినిమా “ఖుషి”. పవన్ కళ్యాణ్ కల్ట్ హిట్స్ లో ఒకటైన టైటిల్ ను ఈ సినిమాకు పెట్టడమే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయగా.. మలయాళ దర్శకుడు హేషమ్ అబ్ధుల్ వహాద్ పాటలు మరింత బజ్ క్రియేట్ చేశాయి.
ఇక విడుదలైన ట్రైలర్ మణిరత్నం తెరకెక్కించిన “సఖి” సినిమాలా ఉండడం చర్చకు దారి తీసింది. ఇంతకీ “ఖుషి” సినిమాగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హల్ చల్ చేయబోతోంది? ఈ సినిమాపై ఆశలు పెట్టుకొన్న హీరోహీరోయిన్ కు, దర్శకుడికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది? ఆడియన్స్ రియాక్షన్ ఏమిటి? అనేది చూద్దాం..!!
కథ: కొంత చిన్నపాటి కన్ఫ్యూజ్డ్ లవ్ స్టోరీ అనంతరం కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకొంటారు విప్లవ్ (విజయ్ దేవరకొండ) & ఆరాధ్య (సమంత). ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేమ/పెళ్లి జంటగా ఉండాలి అనుకుంటూ మొదలైన వీరి ప్రయాణం, ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా చిన్న చిన్న గొడవలతో గాలి తీసేసిన కార్ జర్నీలా సాగుతుంది.
అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం ఏమిటి? వాటిని ఇద్దరూ సాల్వ్ చేసుకోగలిగారా? తొందరపాటులో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా బెడిసికొట్టాయి? చివరికి ఇద్దరూ తమ ప్రయాణాన్ని కొనసాగించగలిగారా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఖుషి” చిత్రం.
నటీనటుల పనితీరు: “గీతాగోవిందం”లో విజయ్ గోవింద్, “అర్జున్ రెడ్డి”లో అర్జున్ ని కలిపితే ఈ చిత్రంలోని విప్లవ్. ఈ రెండు వేరియేషన్స్ కలగలిసి ఉన్న పాత్రలో విజయ్ అలవోకగా జీవించేశాడు. ముఖ్యంగా ఫ్రస్ట్రేటడ్ హజ్బెండ్ గా విజయ్ మ్యానరిజమ్స్ & ఎక్స్ ప్రెషన్స్ నవతరం యువకులకు, కొత్తగా పెళ్లైనవారికి బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ అలరించారు. ఈ సినిమాలో సమంత సాహసం చేసి స్వంత డబ్బింగ్ చెప్పుకోకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. ఆమె మునుపటి సినిమాలకు ఒన్నాఫ్ ది మెయిన్ మైనస్ గా మారిన స్వంత డబ్బింగ్ ను ఈ సినిమాకు ఎవాయిడ్ చేసి.. చిన్మయితో డబ్బింగ్ చెప్పించి మేకర్స్ మంచి పని చేశారు.
ఇక లుక్స్ & యాక్టింగ్ విషయానికి వస్తే.. సమంతతో ఇదివరకటి చురుకుతనం, తేజస్సు లేకుండాపోయాయి. అంత యాక్టివ్ గానూ కనిపించలేదు. చాలా సన్నివేశాల్లో ఆమెకు బదులు బాడీ డబుల్ నటించింది అనే విషయం ఎప్పటికప్పుడు అర్ధమవుతుంటుంది. ఆమె శారీరికంగా త్వరగా కోలుకొని మళ్ళీ మునుపటి సమంతలా చలాకీగా తెరపై కనిపిస్తే బాగుండు. మురళీశర్మ, సచిన్ కాంబినేషన్ సీన్స్ బాగా వర్కవుటయ్యాయి. అలాగే.. బ్రాహ్మణ యువకుడిగా శత్రు నటన ఆశ్చర్యపరిచింది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రోహిణి, శరణ్య తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: మలయాళ మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్ధుల్ వహాద్ పాటలు, నేపధ్య సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అయితే.. లిరిక్ రైటర్ గా దర్శకుడు శివ నిర్వాణ సింగిల్ కార్డ్ క్రెడిట్ తీసుకోకుండా కొన్ని పాటలకైనా కొందరు సీనియర్లకు అవకాశం ఇచ్చి ఉంటే ఇంకాస్త చక్కని సాహిత్యం పాటల్లో వినిపించి ఉండేది. హేషమ్ మాత్రం తనదైన శైలి నేపధ్య సంగీతంతో చాలా పేలవమైన సన్నివేశాలకు కూడా మంచి ఫీల్ ఇచ్చాడు. సంగీత దర్శకుడిగా అతడికి తెలుగులో మంచి క్రేజ్ పెరగడం ఖాయం.
మురళి.జి కెమెరా వర్క్ నీట్ గా ఉంది. కాకపోతే.. కొత్తతరం ప్రేక్షకులు కోరుకునే నవ్యత లోపించింది. ఆల్రెడీ ఒక 100 సినిమాల్లో చూసేసిన ఫ్రేములే తప్పితే.. కాస్త కొత్తగా ఎక్కడా ప్రయత్నించలేదు. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ ను ఎలివేట్ చేస్తూ రిచ్ గా మాత్రం చూపించాడు. సి.జి వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది. దర్శకుడు శివ నిర్వాణ ఎప్పట్లానే.. రొటీన్ కథను ఎంటర్ టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. తన మొదటి సినిమా “నిన్ను కోరి” నుండి అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్న శివకు “ఖుషి” పెద్ద చాలెంజింగ్ సినిమా ఏమీ కాదు.
పైగా.. తన రచనల్లో, దర్శకత్వంలో మణిరత్నం మార్క్ ఉంటుంది అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి “ఆర్రే కాస్త సఖి సినిమాలానే ఉందే” అని కామెంట్ చేసే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. విజయ్-సమంత మధ్య కెమిస్ట్రీని ఇంకాస్త చక్కగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో క్యారెక్టర్స్ , స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్న శివ, సెకండాఫ్ కి వచ్చేసరికి తన బలాన్ని మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు మాత్రం ఎమోషన్ నీట్ గా వర్కవుటయ్యేలా చేసాడు.
విశ్లేషణ: తెలుగులో ఈ తరహా కథలు చాలా వచ్చాయి, ఇకపై కూడా వస్తాయి. కాకపోతే.. శివనిర్వాణ మార్క్ సన్నివేశాలు, ఎమోషన్స్ & సెంటిమెంటల్ సీన్స్ ‘ఖుషి’ చిత్రాన్ని ఎంటర్ టైనింగ్ గా మలిచాయి. రన్ టైమ్ ఇంకాస్త ట్రిమ్ చేసి.. ఎమోషన్స్ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచేది. మొత్తానికి (Kushi) ‘ఖుషి’తో విజయ్ కి మోస్ట్ నీడెడ్ హిట్ దొరికినట్లే.