దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లలో సమంత ఒకరు. ఆమె ఒక రోజు కాల్షీట్ కావాలంటే లక్షల్లో ఉంటుంది. అటువంటిది సినిమా మొత్తానికే పారితోషికం తీసుకోవడం లేదంటే నమ్ముతారా? ఇది నిజం. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న యూ టర్న్ సినిమా కోసం సమంత రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. కన్నడ లో హిట్ సాధించిన యూ టర్న్ మూవీ సమంతకి విపరీతంగా నచ్చింది. ఆ సినిమాలో జర్నలిస్ట్ రోల్ పోషించాలని ఆశించింది. అందుకే ఆ చిత్రాన్ని తెలుగులో తీయాలని పట్టుపట్టింది. ఆ పాత్ర కోసం జుట్టుని కూడా కట్ చేసుకుంది. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్ నే ఈ రీమేక్ కు దర్శకుడిగా ఎంచుకుంది.
ఈ మూవీకి ఎటువంటి ఆర్థికఇబ్బందులు రాకూడదని రెమ్యునరేషన్ తీసుకోనని మాట ఇచ్చింది. సినిమా విజయవంతమై లాభాలను ఆర్జించిన తర్వాత అందులో వాటా అందుకునేలా అగ్రిమెంట్ పై సమంత సైన్ చేసింది. ఇలా సమంత ఒప్పుకోవడం ఇదే తొలిసారి. భూమిక, ఆది, రాహుల్ రవీంద్రన్ లు కీలకమైన పాత్రలను పోషిస్తున్న ఈ మూవీ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ సినిమా కంటే ముందే సమంత నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. అవి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి. రెండోది “ఇరుంబు తిరై(అభిమన్యుడు)”. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటిలో సమంత జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించనుంది. ఈ మూవీ మే 9 న రిలీజ్ కానుంది. ఇక విశాల్ హీరోగా తెరకెక్కిన ఇరుంబు తిరై(అభిమన్యుడు)” తమిళం, తెలుగులో మే 11 న రిలీజ్ కానుంది.