సినిమాల్లో ఆల్‌రౌండర్లు అంటే నటులుగా ఉండి ఇతర విభాగాల్లో తమ ప్రతిభను అప్పుడప్పుడు చూపించేవాళ్లు కనిపిస్తుంటారు. అయితే ఇతర విభాగాల్లో ఉండి.. నటనలో రాణించి ఆల్‌రౌండర్లు అవుతుంటారు కొందరు. ఇలాంటి డబుల్ వర్క్ చేసేవాళ్లు తమిళంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి వారి జాబితాలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ కూడా ఒకరు. డ్యాన్స్‌ల్లో తనదైన ముద్ర వేసిన ఆయన తనదైన విలక్షణ విలనిజంతోనూ రాణిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘కిష్కింధపురి’లో మెయిన్ విలన్ ఆయనే మరి.
తమిళంలో ‘లియో’, మలయాళంలో ‘లోక: చాప్టర్ 1’ సినిమాల ద్వారా నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించారు నృత్య దర్శకుడు శాండీ మాస్టర్. ‘కిష్కింధపురి’ సినిమాతో నటుడిగా తెలుగులోకి అడుగు పెట్టారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాలో శాండీ మాస్టర్ నటనకు మంచి పేరే వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు తొలుత థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు.
ఎందుకంటే లోకేశ్ కనగరాజ్ ‘లియో’ సినిమాలో సైకో విలన్ పాత్ర ఇవ్వకపోయి ఉంటే ‘కిష్కింధపురి’ సినిమా అవకాశం నాకు వచ్చేది కాదు అని అంటున్నారాయన. సినిమాలో చీరకట్టులో.. విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌లో శాండీ మాస్టర్ కొత్తగా కనిపించారు. ఈ క్రమంలో శాండీ మాస్టర్ తన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు శాండీ మాస్టర్ కళ్లు చూసి ‘డెత్ గోట్ ఐస్’ అని అనేవారట. ఇప్పుడు ఆ కళ్ల వల్లే నేను నటుడిగా నిలబడ్డాను అని చెప్పారాయన.
నాకు అలాంటి కళ్లు లేకపోయి ఉంటే ‘లియో’ సినిమాలో ఆ సైకో పాత్రకు లోకేశ్ నన్ను ఎంచుకునేవారు కాదు. ‘లియో’ సినిమా చేశాక నాకు వరుసగా అలాంటి సైకో పాత్రలే వచ్చాయి. అప్పుడే ‘లోక: చాప్టర్ 1’, ‘కిష్కింధపురి’ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు దొరికాయి.. అందుకే వీటిని ఓకే చేశా అని చెప్పారు శాండీ మాస్టర్.