సూపర్ స్టార్ రజినీకాంత్ అధికారికంగా రాజకీయ ప్రవేశం చేయకముందే విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాజకీయనాకులు మాత్రమే కాకుండా తోటి నటుడు సత్యరాజ్ కూడా రజినీపై తీవ్ర విమర్శలు చేశారు. చెన్నైలో ఇటీవల జరిగిన కరుణానిధి 95వ జన్మదినోత్సవ సభలో రజినీపై సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ప్రజలకు సేవ చేయాలనుకుంటే ముందు, వెనకా ఆలోచించకూడదు. కానీ, రజినీ తీరు చూస్తుంటే అలా లేదు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడానికే ఆయన ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారు. అన్ని లెక్కలూ వేసుకుని ప్రవేశించడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారస్తులు మాత్రమే పక్కా వ్యూహాలతో వ్యాపారం ప్రారంభిస్తారు.
మన వ్యాపారం సజావుగా నడుస్తుందా? మన ఉత్సత్తికి మార్కెట్ ఉంటుందా? వంటి అన్ని లెక్కలూ వేసుకుని రంగంలోకి దిగుతారు. రజినీ కూడా అలాంటి లెక్కలన్నీ వేసుకుని రాజకీయంలో అడుగుపెడుతున్నారు. ఆయన చేసేది రాజకీయం కాదు.. వ్యాపారం.” అంటూ ఘాటుగా విమర్శలు సంధించారు. అంతటితో ఆగకుండా “ఆధ్యాత్మిక రాజకీయాలు నడుపబోతున్నట్టు రజినీ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన చేస్తోంది ఆధ్యాత్మిక వ్యాపారం” అంటూ సత్యరాజ్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కాలా సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న రజినీకాంత్ సత్యరాజ్ మాటలపై ఎలా స్పందిస్తారో చూడాలి.